Devadula Project | దేవాదుల అంచనాలకు అవి‘నీటి’ మరకలు…

దేవాదుల అంచనా వ్యయం పెంపుపై బీఆరెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కర్ణాటక ఎన్నికలకు మూటలు పంపేందుకే అంచనాలు పెంచారని బీఆరెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Devadula Project | తెలంగాణలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి బీఆరెస్‌ నాయకత్వం అవినీతి మరకలు అంటించడంతో రాజకీయరంగు పులుముకుంటోంది. నిజానిజాలు తేలకముందే ప్రతిపాదనల్లోనే వేల కోట్లు దండుకున్నారనే ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఢిల్లీకి కప్పం కట్టేందుకు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి మూటలు పంపించేందుకు తెలంగాణను కాంగ్రాస్ నేతలు కొల్లగొడుతున్నారని బీఆరెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ తిప్పికొడుతూ అవినీతి, అక్రమార్జనకు బీఆర్ఎస్ నేతలే కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రతిదాడి చేస్తున్నారు. ఇరుపార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. దీంతో ‘అభివృద్ధి’ అంటేనే అధికారంలో ఉన్న పార్టీల అవినీతికి ఊతమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

దేవాదులకు అతినీతి మరకలు

తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు చుట్టూ అవినీతి రాజకీయం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు… ఆ తర్వాత పదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వపాలన, తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తాజాగా కాంగ్రెస్ రెండేళ్ళ పాలనలో కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి తదితరులు ఆదివారం దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విమర్శలతోపాటు ప్రాజెక్టు పూర్తికి చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు వివరించారు. ప్రాజెక్టును 2027 వరకు పూర్తిచేసి తీరుతామంటూ ప్రకటించారు.

దేవాదుల అంచనాలు రూ. 18,500 కోట్లు: సీఎం రేవంత్

సీఎం మాట్లాడుతూ జూన్ 2 లోపల దేవాదుల భూసేకరణ కోసం రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రూ. 6000 కోట్ల అంచనాలతో మొదలైన దేవాదుల ఇప్పుడు 18,500 కోట్లకు చేరిందన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన పుణ్యానే దేవాదుల, ఇతర ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినపుడు పరిస్థితి బాగానే ఉందని కానీ, ఆ పార్టీ ఒక్క కాళేశ్వరానికే లక్షా10 కోట్ల నిధులు కేటాయించి మిగిలిన వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. నదీ జలాల విషయంలో కూడా పార్టీ తప్పుచేసిందన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలన పై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. 2027 డిసెంబర్ నెలాఖరుకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరుతో పాటు తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కేరళ ఎన్నికల ఫండ్ కోసం అంచనాలు పెంపు: బీఆర్ఎస్

దేవాదుల ప్రాజెక్టు అంచనాలు పెంచడం కేరళ ఎన్నికల ఫండ్ కోసమేనంటూ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. ప్రాజెక్టును 90 శాతం బీఆర్ఎస్ పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేయ‌లేక‌పోయిందని విమర్శించారు. తమ ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు కేటాయించి అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2ల‌ను పూర్తి చేసి, ఫేజ్ 3 ప్రణాళిక‌లు ప‌నులు ప్రారంభించారంటూ చెప్పుకొచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసం మాత్రమే దేవాదుల నిర్మాణంపై ఈ సమీక్షలు చేస్తున్నారంటూ తాజాగా ఆరోపణలు చేయడం గమనార్హం. దేవాదుల మూడో ఫేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.17000 కోట్ల అంచనా వేసి ఇప్పుడు 24,000 కోట్లకు ఎలా పెంచారంటూ ప్రశ్నించారు. పెంచిన రూ. 7 వేల కోట్లలో కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు.

Latest News