దేవాదుల ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం : సీఎం రేవంత్‌ రెడ్డి… ప్రాజెక్టు సందర్శన

దేవాదుల ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గ్రీన్‌చానల్‌లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 22, 2026 8:38 PM IST
దేవాదుల ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం : సీఎం రేవంత్‌ రెడ్డి… ప్రాజెక్టు సందర్శన

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
గోదావరి నదిపై ములుగు జిల్లా తుపాకులగూడెం సమీపంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు పనులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అవసరమైన నిధులు గ్రీన్ ఛానల్ లో అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం దేవాదుల లిఫ్టింగ్ పాయింట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, తెల్లం వెంకట్రావు, ములుగు జిల్లా అధికారులు. నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ ను ఇంటేక్ వెల్, మోటార్లను, గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 2 లోపల భూసేకరణ కోసం రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో పే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి అవసరమైన ఆమోదం తీసుకోవాలని సూచించారు. మార్చి లో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. ఇక రిపేర్లలో ఉన్న దేవాదుల పంప్ మరమ్మత్తు పనులను నెలరోజుల్లో పూర్తి చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎంఎల్ ఏ లు, అధికారులతో దేవాదుల ప్రాజెక్టు పైన ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని సమస్యలు సంపూర్ణంగా చర్చిస్తామన్నారు.

ఈ సందర్భంగా ఆయన అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూ నిర్వాసితులకు పరిహారం గ్రీన్ ఛానల్ లో మంజూరు చేస్తామన్నారు. భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్ట్ ల పనులు ఆగడానికి వీలు లేదని చెప్పారు. ఇదిలా ఉండగా రామప్ప చెరువు నుంచి జంపన్న వాగు కు నీరు అందించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రణాళిక పైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్ , ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా లు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు ముందు మహబూబాద్ జిల్లా రెడ్యాలో ఇటీవల మృతి చెందిన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రాఘవేందర్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండగా, మరో కుమారుడు ఒక ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలుచల్లి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.