Site icon vidhaatha

India Alliance | చంద్రబాబు, నితీశ్‌ను సంప్రదిస్తున్న ఇండియా కూటమి?

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలపై నాయకుల దృష్టి
ఇండియాలోకి బాబు, నితీశ్‌ రాకతో ఎన్డీయేకు తగ్గనన్న మెజార్టీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు చుక్కలు చూపించిన ఇండియా కూటమి.. అవకాశం ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే పాత మిత్రులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత, ఇండియా కూటమి ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించి, బీజేపీ పక్షాన చేరిన నితీశ్‌కుమార్‌లను ఇండియా నేతలు సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కడపటి వార్తల ప్రకారం.. ప్రతిపక్ష ఇండియా కూటమి 234 స్థానాల్లో ఆధిపత్యంలో ఉన్నది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను పటాపంచలు చేసింది. ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ కూటమిలో కొందరు నాయకులను తమవైప తిప్పుకోవడంతోపాటు.. ఏ పక్షంలోనూ లేని కొన్ని పార్టీల మద్దతు సంపాదించడంపై ఆశాభావంతో ఉన్నారని తెలుస్తున్నది.

ఇండియా కూటమిలో కీలక భాగస్వామి డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ఏపీలో తిరుగులేని విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేశారని, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని సమాచారం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ సైతం ఇండియా కూటమికి మెజార్టీకి అవసరమైన 272 స్థానాలు కూడగట్టేందుకు ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తున్నది. వైసీపీని సైతం తమ పక్షంలో చేర్చుకునేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

నితీశ్‌కుమార్‌, చంద్రబాబు మద్దతు లభిస్తే ఇండియా కూటమికి అదనంగా 30 స్థానాలు పెరుగుతాయి. నితీశ్‌కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా లేదా ఇండియా కూటమి కన్వీనర్‌గా చేసేందుకు అభ్యంతరాలు లేవని కొందరు భాగస్వామ్య పక్ష నేతలు అంటున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఉన్న వివరాల ప్రకారం.. ఎన్డీయే 290 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఇండియా కూటమి 235 స్థానాల్లో ముందంజలో ఉన్నది. నితీశ్‌, చంద్రబాబు చేరికతో అవి 265కు చేరుకుంటాయి. వైసీపీ తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమికి అవకాశాలు మెరుగుపడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version