Site icon vidhaatha

India Justice | పోలీస్‌ స్టేషన్లు, ఉన్నత స్థాయి కోర్టుల్లో దళితులు, గిరిజనుల ప్రాతినిధ్యమెంత?

India Justice | అనేక మతాలు, అసంఖ్యాక కులాలతో వైవిధ్యభరితంగా ఉంటుంది భారతదేశం. దీనికి తోడు తీవ్ర ఆసమానతలు ఉన్న ఆర్థిక వ్యవస్థగానూ ఉన్నది. అన్యాయం జరిగితే.. న్యాయం చేయండని మొత్తుకుంటున్న బలహీనవర్గాలు ఎన్నో. ఈ దేశంలోని వీరందరికీ సమాన అవకాశాలు, సమ న్యాయం అందించే భారం, బాధ్యత మన దేశ న్యాయ వ్యవస్థపైనే ఉన్నది. కానీ.. ఇంత ప్రాధాన్యం ఉన్న న్యాయవ్యవస్థలో దళితులు, గిరిజనులకు చాలా స్వల్ప స్థాయిలోనే ప్రాతినిధ్యం ఉన్నదని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలోని జడ్జీలలో ఎస్సీ, ఎస్టీల నుంచి మూడు శాతం మాత్రమే ఉన్నారని ఇండియా జస్టిస్‌ 2025 నివేదిక తెలిపింది. దేశ పోలీసుల, న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యంపై రాజ్యాంగం ఇచ్చిన హామీ దూరతీరాల్లోనే నిలిచిపోయిందని నివేదిక ద్వారా వెల్లడవుతున్నది. అంతేకాదు.. మహిళలు, దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగం చేసిన వాగ్దానం చాలావరకు నెరవేరలేదని పేర్కొంటున్నది.

సజాతీయంగా న్యాయవ్యవస్థ
విషాదం ఏమిటంటే.. భారతదేశ ప్రజాస్వామ్యానికి మూడో మూల స్తంభంగా కీర్తించే న్యాయ వ్యవస్థ సజాతీయంగానే ఉన్నది. కాలక్రమేణా సబార్డినేట్‌ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరిగినప్పటికీ.. ఉన్నత స్థాయి కోర్టుల్లో నిరుత్సాహపూరితమైన దిగువ స్థాయిలోనే కనిపిస్తున్నది. జడ్జీలు అందరినీ కలుపుకొంటే మహిళా న్యాయమూర్తులు 37.4 శాతం ఉన్నారని, అందులో దిగువ కోర్టుల్లోనే 38 శాతం మంది ఉన్నారని నివేదిక పేర్కొన్నది. 14 శాతం మంది మాత్రమే ఉన్నతస్థాయి కోర్టుల్లో పనిచేస్తున్నారు. 2022— 2025 సంవత్సరాల మధ్య హైకోర్టులు, దిగువ కోర్టుల్లో లింగ సమానత్వం కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగినట్టు నివేదిక తెలిపింది. 2022 తర్వాత ఒక్క గుజరాత్‌లో మాత్రమే సబార్డినేట్‌ కోర్టుల (20%) కంటే హైకోర్టులో ఎక్కువ మంది మహిళా జడ్జీలు (25%) ఉన్నారు. మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్‌ హైకోర్టుల్లో పేరుకు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా జడ్జీ లేరు. అయితే.. రాష్ట్రాల్లోని సబార్డినేట్‌ కోర్టుల్లో మహిళలు గణనీయంగానే ఉన్నారు. అక్కడక్కడ కొన్ని మినహాయింపులు తప్పిస్తే ప్రధానంగా ఆధిపత్య కులాల నుంచి వచ్చిన పురుషులే నాయకత్వ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని నివేదిక తేల్చింది.

దయనీయంగా బడుగు కులాల ప్రాతినిధ్యం
కులాల ప్రాతినిధ్యం విషయానికి వస్తే.. పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. హైకోర్టుల్లో కుల వైవిధ్యంపై రాష్ట్రాలవారీగా డాటా అందుబాటులో లేని విషయాన్ని నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. అయితే.. పార్లమెంటులో ఇచ్చిన సమాధానాలను పరిశీలించినట్టయితే.. 2018 నుంచి హైకోర్టుల్లో జరిగిన నియామకాల్లో ఎస్సీల నుంచి 22 మంది, ఎస్టీల నుంచి 15, ఓబీసీల నుంచి 87, మైనార్టీ కమ్యూనిటీల నుంచి 37 మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు మినహా ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను భర్తీ చేయలేదు. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ కోటాలో 50 శాతాన్ని దాటాయి. తెలంగాణ, కర్ణాటక, జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు కోటా మేరకు ఎస్టీ జడ్జీలను కలిగి ఉన్నాయి. గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాలు కేవలం 2 శాతమే భర్తీ చేశాయి.
దివ్యాంగులకు వారి హక్కుల చట్ట ప్రకారమే 4 శాతం రిజర్వేషన్‌ ఉండాలి. కానీ.. న్యాయ వ్యవస్థలో ఏ మూల కూడా వారు కనిపించరు. ఇది చట్టాన్నే కాకుండా.. నైతికతను కూడా ఉల్లంఘిస్తున్నది.

పోలీసు వ్యవస్థలోనూ ఇంతే
సాధారణంగా తమకు అన్యాయం జరిగితే ప్రజలు మొదట వెళ్లేది పోలీసుల దగ్గరికే. అందుకే ఈ వ్యవస్థలో బలహీనవర్గాలకు చెందినవారి ప్రాతినిధ్యం అత్యంత కీలకంగా మారింది. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన సమాజాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు అది రాజ్యాంగపరమైన రిక్వైర్‌మెంట్‌ మాత్రమే కాదు.. ప్రజాస్వామిక ప్రాధాన్యం కూడా. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, పది మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని అనేక సందర్భాల్లో కేంద్ర హోం శాఖ సిఫారసు చేస్తూ వచ్చాయి. 2022లో కొంత వరకూ ఢిల్లీ తప్ప ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వాటిని పాటించిన దాఖలాలు లేవు. మహిళా ఎస్‌ఐలు సగటు 0.7 శాతం మాత్రమే. అందులోనూ కొన్ని ప్రధాన స్టేషన్లలో ఒక్క మహిళ కూడా లేరు. కానిస్టేబుళ్ల పరంగా మాత్రం సగటు మెరుగ్గా కనిపిస్తున్నది. మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేని విషయాన్ని మాత్రమే కాదు.. వారి అవసరాలకు తగినట్టుగా పని ప్రదేశాలు లేని విషయాన్ని కూడా నివేదిక హైలైట్‌ చేసేంది. చాలా చోట్ల వారికి విడిగా రెస్ట్‌ రూమ్స్‌ లేవని పేర్కొన్నది. మహిళలను పోలీస్‌ వ్యవస్థలో నియమించుకోవడమే కాదు.. వారికి తగిన పని వాతావరణాన్ని కూడా కల్పించాల్సి ఉన్నదని, అప్పుడే వారు ఈ సమాజంలో తగిన మార్పుకోసం పనిచేయగలుగుతారని నివేదిక వ్యాఖ్యానించింది.

రిజర్వేషన్ల అమలులో కర్ణాటక టాప్‌
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను పరిపూర్ణంగా పోలీసు శాఖలో అమలు చేసిన రాష్ట్రంగా కర్ణాటక టాప్‌లో నిలిచింది. ఇతర చాలా రాష్ట్రాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్‌ ఆశించిన స్థాయిలో లేదు. పైగా హయ్యర్‌ లెవెల్‌ పోస్టుల్లో అత్యధికంగా ఆధిపత్య కులాల పురుషులే ఉండటం గమనార్హం. ఈ అసమతుల్యత తాను సేవ చేసే సామాజికవర్గాల జీవన వాస్తవాను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించే సామర్థ్యానికి తీవ్ర అడ్డంకిగా మారింది.

ఇవి కూడా చదవండి..

Good News: సెర్ఫ్‌లో సాధారణ బదిలీలకు రంగం సిద్దం.. జీవో జారీ

ఎన్నికల సంఘంపై.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!

Viral: ఈ నిమ్మకాయ ధర.. అక్ష‌రాల‌ రూ.25వేలు!

Exit mobile version