India warn Pakistan | యుద్ధోన్మాద వ్యాఖ్యలను తగ్గించుకుంటే మంచిదని పాకిస్తాన్‌కు భారత విదేశాంగ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. ‘తీవ్ర బాధకరమైన పర్యవసానాలు’ ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ ప్రతినిధి పై విధంగా స్పందించారు. ఢిల్లీలో గురువారంనాడు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్.. ‘భారత్‌పై పాకిస్తాన్ నాయకత్వం నిర్లక్ష్యపూరితంగా నిరవధికంగా చేస్తున్న యుద్ధోన్మాద, విద్వేష వ్యాఖ్యలను మేం గమనిస్తున్నాం. తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడం అనేది పాకిస్తాన్ నాయకత్వం వ్యూహంగా అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ‘తమ వాక్చాతుర్య గుణాన్ని నియంత్రించుకోవాలని మంచిగా పాకిస్తాన్‌కు సలహా ఇస్తున్నాం. ఎందుకంటే.. ఏదైనా దుస్సాహసానికి తెగించినట్టయితేమ ఇప్పటికే అనుభవించినట్టు.. బాధాకరమైన పర్యవసనాలను పాకిస్తాన్ ఎదుర్కొనాల్సి ఉంటుంది’ అని ఆయన తేల్చి చెప్పారు.
ఇటీవల అమెరికాలో మాట్లాడిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్.. ‘అణుదేశమైన మేం పోవాల్సి వస్తే సగం ప్రపంచాన్ని మా వెంటపెట్టుకుని వెళతాం’ అని అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. అణు ప్రేలాపనలు చేయడం ఆ దేశానికి అలవాటేనని వ్యాఖ్యానించింది. ఇటీవల అమెరికాలోని పాకిస్తానీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సింధు నది నుంచి ఒక్కచుక్క నీటిని భారత్ తీసుకున్నా.. దానిని యుద్ధపూరిత చర్యగానే పరిగణిస్తామని హెచ్చరించారు.
భారత్, అమెరికా సంబంధాలపై జైస్వాల్ మాట్లాడుతూ.. రెండు దేశాల సంబంధాలకు ఉమ్మడి ప్రయోజనాలే ఆధారమని చెప్పారు. అవి ప్రజలకు, ప్రజలకు మధ్య దృఢమైన సంబంధాలన్నారు. ఈ భాగస్వామ్యం అనేక సవాళ్లను, మార్పులను ఎదుర్కొని నిలిచిందని చెప్పారు. ఈ బంధం భవిష్యత్తులోనూ ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.