Site icon vidhaatha

Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్.. భార‌త సైన్యం మెరుపుదాడుల వీడియోలు రిలీజ్

Operation Sindoor | విధాత : ఏప్రిల్ 22న ప‌హ‌ల్గాంలోని బైస‌ర‌న్ ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో సేద తీరుతున్న ప‌ర్యాటకుల‌పై ఉగ్ర‌వాదులు విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపి 26 మందిని పొట్ట‌న పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదుల ప‌ట్ల సీరియ‌స్‌గా ఉంది. భార‌త సైన్యంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపి.. చివ‌ర‌కు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త్ మిస్సైళ్ల‌తో మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను భార‌త సైన్యం ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్ర‌వాదులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. అయితే మురిద్కేలోని ల‌ష్క‌రే తోయిబా, బ‌హ‌వ‌ల్పూర్‌లోని జైషే ఉగ్ర‌వాద స్థావ‌రాల్లోనే 30 మంది చొప్పున ఉగ్ర‌వాదులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కచ్చితమైన సమాచారం లేదు.

కాగా, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని బ‌హ‌వ‌ల్పూర్‌లో ఉన్న జైషే ఈ మ‌హ‌మ్మద్‌ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా బేస్‌ క్యాంపు, శిక్షణా కేంద్రం, కోట్లీలోని సూసైడ్ బాంబ‌ర్ ట్రైనింగ్‌, టెర్రర్‌ లాంచ్ బేస్, గుల్‌పూర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌, స‌వాయిలోని ల‌ష్కరే శిబిరం, సర్జల్‌, బర్నాలాలోని ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలు, మెహ‌మూనాలోని హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాద శిబిరం, బిలాల్‌లోని జైషే మహ‌మ్మద్‌కు చెందిన మ‌రో ల్యాంచ్‌ప్యాడ్‌ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కల్నల్ సోఫియా ఖురేషి ఈ వివరాలను మీడియాకు వెల్ల‌డించారు. మెరుపుదాడుల‌కు సంబంధించి ఆర్మీ విడుదల చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version