Site icon vidhaatha

Operation Kagar | బేషరతుగా శాంతి చర్చలకు సిద్ధమన్న మావోయిస్టుల.. లేఖ విడుదల

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Operation Kagar | నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర కమిటీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 2024 జనవరి నుంచి కేంద్ర, రాష్ట్ర పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు ఆపరేషన్ ‘కగార్’ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసులను హత్య చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారని, ఆపరేషన్ ‘కగార్’ను తక్షణం నిలిపివేసి, కాల్పులు విరమించి ప్రభుత్వం, మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారని తెలిపారు.

శాంతి చర్చలకు సిద్ధం
ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటనలో తెలిపామని, తమ పీ.ఎల్.జీ.ఏ. బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని తమ నేతలు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. శాంతి చర్చలకు సన్నద్ధతపై ఇప్పటికే మూడు ప్రకటనలు విడుదల చేసినా.. ప్రభుత్వ హత్యాకాండ కొనసాగుతూనే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు తమ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు ఏమాత్రం అర్థం లేకుండా పోతుందని అభయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా, దేశవ్యాప్తంగా ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మరోసారి మావోయిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

MLC KAVITHA | ఆపరేషన్ కగార్.. వెంటనే నిలిపివేయాలి
ఆపరేషన్ కగార్ నిలిపివేసి.. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి
Meta Chat Bot | కృత్రిమ మేథ పిచ్చి.. పీక్‌ స్టేజ్‌కి! మెటా నుంచి రోల్‌ ప్లే చాట్‌బాట్‌!

Exit mobile version