Haryana Assembly Elections । 2019లో ఒక్క సీటు కూడా గెలవలేని స్థితి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, జాతీయ స్థాయిలో కలిసి వచ్చిన అంశాల ఆధారంగా విజయాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వాస్తవానికి హర్యానాలో విజయతీరాలకు చేరుతుందని చాలా సర్వేలు ఊహించాయి. కానీ.. వాటి అంచనాలకు భిన్నమైన తీర్పు వచ్చింది. ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌కు దారి తీసిన పరిస్థితులు ఎంటి? అనే అంశంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేననేది మాత్రం అందరూ చెబుతున్న అంశం. వాస్తవానికి హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ సమయంలో తగిన రాజకీయ వ్యూహాలతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సర్దుబాట్లతో ఉమ్మడి, బలమైన శత్రువుపై పోరాడితే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నాయిబ్ సింగ్ సైని మంత్రివర్గంలోని పది మంది మంత్రులు ఎనిమిది మంది ఓడిపోవడం, అందులోనూ ముగ్గురు మూడో స్థానానికి వెళ్లిపోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఒక కీలక సంకేతం. అయినా హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు షాక్‌ను ఇచ్చాయి. 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 49 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేపట్టేందుకు సిద్ధమయింది. దీంతో సహజంగానే ఇండియా భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌నే టార్గెట్ చేసుకున్నాయి. పార్టీలోనూ అంతర్గతంగా బ్లేమ్ గేమ్ మొదలైంది. హర్యానా సీనియర్ నేతల్లో భూపిందర్‌సింగ్ హూడా, కుమారి శెల్జా మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు మెల్లగా తీవ్రస్థాయికి కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ వైఖరి కూడా ఇందుకు అవకాశం ఇచ్చిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
‘అహంకారం, తానే గొప్ప అనే భావన, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటం అనే మూడు అంశాలను కలిపి వండితే వచ్చినదే ఈ వినాశనం’ అంటూ కాంగ్రెస్ ముఖం మీదే తృణమూల్ కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఎక్స్ లో ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. ‘ఎన్నికల్లో ఓటమికి ఈ వైఖరే కారణం : ‘మేం గెలుస్తున్నాం అని మేం భావిస్తే ఏ ప్రాంతీయ పార్టీని మా దరికి చేరనీయబోము. మేం ఎక్కడైతే తక్కువ స్థాయిలో ఉంటామో అక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీలు మమ్మల్ని చేర్చుకోవాలి. అహంకారం, హక్కు భుక్తం, ప్రాంతీయ పార్టీలను చిన్న చూపు చూడటం.. వీటిని కలిపి వండితే వచ్చిందే ఈ వినాశనం. నేర్చుకోండి’ అని గోఖలే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగాల్‌లో సీట్ల కోసం పట్టుబట్టడంతో తృణమూల్ కాంగ్రెస్ తిరస్కరించి, కాంగ్రెస్‌ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో గెలవగలిగింది.
బీజేపీతో నేరుగా ఢీకొనే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్టుసాధించలేక పోతున్నది. ఇది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రుజువైంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల మాత్రమే అది వాటి మద్దతుతో అన్నో ఇన్నో సీట్లు సంపాదించుకో గలుతున్నదనేది వాస్తవం. కానీ.. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించారా? అన్నదే సమస్య. ఇదే అంశాన్ని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలని ఆమె అన్నారు. ‘ఎందుకంటే బీజేపీతో నేరుగా ఢీకొనే చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోతున్నది’ అని వ్యాఖ్యానించారు.
ఆప్ నేత రాఘవ్ ఛద్దా.. ఎక్స్‌లో కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఉర్దూ పద్యంలోని ఒక భాగాన్నిఆయన ఉటంకించారు. ‘హమారీ ఆరుజూ కీ ఫిక్ర్ కర్తే తే కుఛీ ఓర్ బతా హోతీ, హమారీ హస్రత్ కా ఖయాల్ రఖ్తే థే ఏక్ అలగ్ శామ్ హోతీ ఆజ్ వే భీ పశ్చాత్ రహా హోగా మేరా సాథ్ ఛిడ్కర్, అగర్ సాథ్ సాథ్ చల్తే తో కుఛీ ఓర్ బతా హోతీ’.. (నా కోరికలను పట్టించుకుంటే అది వేరే విషయం. మా ఆకాంలను పట్ల శ్రద్ధ తీసుకుని ఉంటే అది భిన్నమైన సాయంత్రం. ఈ రోజు తను కూడా నన్ను విడిచిపెట్టినందుకు పశ్చాత్తాపపడి ఉండాలి. మనం కనుక కలిసి నడిచి ఉంటే ఇది మరోలా ఉండి ఉండేది’.. అంటూ ఐక్యత అవసరాన్ని చాటి చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కోసం జరిగిన విఫల చర్చలను ఆయన ఈ ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. దాదాపు 11 సీట్లలో కాంగ్రెస్‌పార్టీ 3 వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఓటమి నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు సైతం విమర్శలు కుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి పార్టీ పేలవమైన పనితీరే కారణమని, సమన్వయం లేదని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా అన్నారు. ‘ఈ ఎన్నికల్లో సమన్వయం చేసుకోవడంలో మేం విఫలమయ్యాం. పార్టీ మేనేజ్‌మెంట్ లోపాల వల్లే పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి చిన్నదానికి బాహాటంగా గొడవలకు దిగడం, గెలుస్తామన్న తప్పుడు భ్రమలు, అదే తరహా ప్రచారం హర్యానాలోని కొన్ని సెక్షన్లలో ప్రభావం చూపాయి. ఫలితంగానే కచ్చితంగా గెలిచే చోట ఓటమి ఎదురైంది’ అని ఆమె సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ‘హర్యానాలో ఫలితాలు నిరుత్సాహం కల్గించాయి. హర్యానాకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నేను 2004 నుంచి 2009 వరకూ కాంగ్రెస్ విజయం సాధించిన రెండు సమయాల్లో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాను. విజయానికి తటస్థత, పార్టీని ఏకతాటిపై నడిపించడం అవసరం. వ్యక్తిగత ఆకాంక్షలు, పార్టీ ప్రయోజనాల మధ్య సమన్వయాన్ని సాధించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనని సిర్సా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కుమారి శెల్జా.. ఎన్నికల ఫలితాలపై నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఫలితాలను సమీక్షించుకుంటామని చెప్పారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడా, ఆయన కుమారుడు దీపిందర్ హూడాలపై పరోక్షంగా విమర్శలు కురిపించిన శెల్జా.. ఎన్నికల్లో ఓటమికి బాధ్యతెవరిదని ప్రశ్నించారు. నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని వ్యాఖ్యానించారు. ‘ఫలితాలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఉదయం వరకూ చాలా ఆశాభావంతో ఉన్నాం. మా కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. వాళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డారు. ఇప్పుడు ఇలాంటి ఫలితం రావడం చాలా నిరుత్సాహంగా ఉన్నది’ అని శెల్జా మీడియాకు చెప్పారు.
జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘దాని పేలవమైన ప్రదర్శనపై కాంగ్రెస్ బాధతో ఉన్నదనేది స్పష్టం. ఇప్పటికే వాళ్లకు దెబ్బతగిలింది. నేను మరింత బాధపెట్టదల్చుకోలేదు. కాంగ్రెస్ కూర్చొని విశ్లేషించుకుంటుదని నమ్ముతున్నా’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ బలం తక్కువ కావడంతోనే అక్కడ ఎన్సీపీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధపడిందనేది వాస్తవం.
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నేరుగా తలపడిన రాష్ట్రాల్లో పరాజయాలు ఎదురయ్యాయి. అంతకు ముందే గెలిచిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి అనూహ్య ఫలితాలు వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన వ్యూహాలు రచించుకుని ఉంటే.. కీలకమైన ఒక ఉత్తరాది రాష్ట్రం.. అందులోనూ రైతు చట్టాల ఉపసంహరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హర్యానాలో ఈనాడు కాంగ్రెస్ జెండా ఎగురుతూ ఉండేది. హర్యానా ఎన్నికలు 2029 లోక్‌సభ ఎన్నికలకు గట్టి గుణపాఠంగానే భావించాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్.. తన మిత్రపక్షాలతో కలిసి వేసే అడుగులే తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయకంగా ఉంటాయి. ఎందుకంటే.. బీజేపీ, ఆరెస్సెస్ మతోన్మాద ప్రమాదాన్ని సరిగ్గా అంచనా కట్టిన ప్రతిపక్ష నేతల్లో రాహుల్ గాంధీ ఒకరు. భారత్ జోడో యాత్రలోగానీ, తదుపరి భారత్ జోడో న్యాయ్ యాత్రలోగానీ ఆయన బీజేపీ నుంచి రాజ్యాంగానికి పొంచి ఉన్న ముప్పును ప్రధానంగా ఎండగట్టారు. ఆయన దీర్ఘకాలిక లక్ష్యమే బీజేపీ ఓటమి. దీన్ని ఆయా రాష్ట్రాల నాయకత్వం అందిపుచ్చుకుని, తగినట్టు పని చేస్తే హర్యానా లాంటి పొరపాట్లు పునరావృతం కావు.