Site icon vidhaatha

Poll schedule for J&K and Haryana । జమ్ముకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Poll schedule for J&K and Haryana । జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి సెప్టెంబర్‌ 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. హర్యానాకు అక్టోబర్‌ ఒకటిన పోలింగ్‌ ఉంటుంది. ఫలితాలను అక్టోబర్‌ 4న ప్రకటిస్తారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (Chief Election Commissioner), ఎలక్షన్‌ కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, డాక్టర్‌ సంధు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) అసెంబ్లీలో 90 స్థానాలు ఉన్నాయి. వీటికి మూడు దశల్లో (three phases) ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. తొలి దశ సెప్టెంబర్‌ 18న (September 18) ఉంటుందని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 లక్షల మహిళలు.. మొత్తం 87.09 లక్షల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. తొలిసారి ఓటు వేయబోతున్నవారు (first-time voters) 3.71 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. మొత్తం 11,800 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన రాజీవ్‌కుమార్‌.. సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న పోలింగ్‌ ఉంటుందని తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు.

జమ్ముకశ్మీర్‌లో మొత్తం ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 6న ముగుస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం (coalition government) ఏర్పడింది. అయితే.. రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని (Article 370) రద్దు చేసేందుకు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌గా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.

Exit mobile version