Suraj Revanna : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ (Revanna) చిన్న కుమారుడు, హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఇప్పటికే అరెస్టయ్యి జైల్లో ఉన్నాడు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన మరో నాయకుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. మాజీ మంత్రి రేవణ్ణ పెద్ద కుమారుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ (Suraj Revanna) తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
లైంగిక దాడులను తాను ప్రతిఘటిస్తున్నందుకు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని జేడీఎస్ కార్యకర్త కూడా అయిన ఆ యువకుడు డీజీపీకి, హసన ఎస్పీకి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. మొత్తం 15 పేజీల లేఖ రాసిన బాధితుడు తనపై జరుగుతున్న లైంగికదాడితోపాటు పలు ఇతర విషయాలను వెల్లడించాడు. తనకు ఉద్యోగం ఇస్తానని, ఆర్థికంగా అండగా ఉంటానని నమ్మించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆ తర్వాత తనని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చాడు. బాధిత యువకుడికి పోలీసులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అతని శరీరంపై గాయలను గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తనపై యువకుడు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ సన్నిహితులు ఖండించారు. కార్యకర్త రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని, ఇవ్వనందుకు ఆరోపనలు చేస్తున్నాడని పేర్కొన్నారు. బాధితుడిపై హుళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో కేసుపెట్టారు.