Shibu Soren | రాంచీ : జార్ఖండ్( Jharkhand ) రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్( Shibu Soren ) (81) ఇక లేరు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం, ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన శిబూ సోరెన్.. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆదివాసీ( Adivasi ) హక్కుల కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయనను.. దిషోమ్ గురు( Dishom Guru ) అనే బిరుదుతో గౌరవంగా పిలిచేవారు ఆదివాసీలు. దిషోమ్ గురు అంటే లీడర్ ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం. అలా ఆదివాసీల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శిబూ సోరెన్ మృతిని ఆదివాసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ గురు ఇక లేడని బోరున విలపిస్తూ నివాళులర్పిస్తున్నారు.
ముక్తిమోర్చా స్థాపకుడిగా.. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో శిబూ సోరెన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగానూ సేవలదించారు. శిబూ సొరేన్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్‌సభకు 8 సార్లు ఎంపికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
శిబూ సోరెన్ వ్యక్తిగత జీవితం..
జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలోని నేమ్రా గ్రామంలో 1944 జనవరి 11వ తేదీన శిబూ సోరెన్ పురుడు పోసుకున్నారు. సోరెన్ తండ్రి సోమ్లాంగ్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. చిన్నతనంలోనే శిబూ సోరెన్ సామాజిక సేవ, ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. సంతాల్ తెగకు చెందిన శిబూ సోరెన్ ‘సంతాల్ సుధవ్ సమాజ్’ను స్థాపించారు. 1960ల చివరలో గిరిజనుల ప్రయోజనాల కోసం ధన్‌బాద్ జిల్లాలోని తుండి బ్లాక్‌లో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
దిషోమ్ గురు రాజకీయ ప్రస్థానం..
శిబూ సోరెన్ ఆదివాసీ నాయకుడిగా, జార్ఖండ్ ముక్తి మోర్చా( Jharkhand Mukti Morcha ) స్థాపకుడిగా చేసిన కృషి ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్యుల హక్కులు, ఆదివాసీ సమాజ ఉద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. 1971లో జేఎంఎం ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. 1980లో తొలిసారిగా దుమ్కా నియోజకవర్గం నుంచి 7వ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1986లో జేఎంఎం అధ్యక్షుడిగా సోరెన్ నియామకం అయ్యారు.
1989- 1996 నుంచి వరుసగా మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో జేఎంఎం పార్లమెంటరీ నాయకుడిగా నియామకం అయ్యారు. 1998-2001 మధ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ 2002, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 మే నెలలో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా నియామకం అయ్యారు. 2004 జులై నెలలో కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేశారు.
10 రోజులకే ముఖ్యమంత్రిగా రాజీనామా
2005 మార్చిలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే, మెజారిటీ లేకపోవడంతో 10 రోజుల్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006 జనవరి 29 నుంచి నవంబర్ 28 దాకా మళ్లీ బొగ్గు గనుల మంత్రిగా సేవలందించారు. వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్యకేసులో నేరస్థుడిగా తేలడంతో 2006 నవంబర్ 29న రాజీనామా చేశారు. 2007 జూన్ 25న శిబూ సోరెన్‌ను దమ్కాలోని జైలుకు తరలిస్తుండగా బాంబుల దాడి జరిగింది.
2008 ఆగస్టు 27న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఆయన ఎమ్మెల్యే కాకపోవడం వల్ల జనవరి 12, 2009న రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో లోక్‌సభలో జేఎంఎం పార్లమెంటరీ నాయకుడిగా నియామకం అయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2009 డిసెంబర్ 30న మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ మద్దతు లభించకపోవడంతో 2010 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌ను 39,030 ఓట్ల తేడాతో ఓడించారు. 2019 ఎన్నికల్లో సునీల్ సోరెన్ చేతిలో 47,590 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్ వర్షకాల సమావేశ ప్రారంభంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు శిబూ సోరెన్.