Arvind Kejriwal | బెయిల్‌పై కేజ్రీవాల్‌కు దక్కని ఊరట 5వ తేదీకి తీర్పు రిజర్వ్‌ నేడు మళ్లీ జైలుకు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువును మరో ఏడు రోజుల పాటు పొడగించాలని ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును జూన్ 5వ తేదీకి రిజర్వ్ చేసింది

  • Publish Date - June 1, 2024 / 05:24 PM IST

విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువును మరో ఏడు రోజుల పాటు పొడగించాలని ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును జూన్ 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోనున్నందునా ఆదివారం మధ్యాహ్నం కేజ్రీవాల్ జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే లొంగుబాటు ప్రకటన చేశారు. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. శనివారంతో ఆ బెయిల్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దానిపై శనివారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని సీఎం తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును జూన్ 5కు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ నేడు ఆదివారం జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు.

Latest News