Site icon vidhaatha

Arvind Kejriwal । అవినీతి వ్యతిరేక ఉద్యమంతో మొదలై.. ఇదీ కేజ్రీవాల్‌ రాజకీయ ప్రయాణం

Arvind Kejriwal । ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే 2011లో జన్‌ లోక్‌పాల్‌ బిల్లుపై ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ కెరీర్‌ మొదలైంది. స్వచ్ఛమైన పరిపాలన కోసం సాగిన ఆ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో కేజ్రీవాల్‌ 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేసి మొత్తం 70 సీట్లకుగాను 28 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు.

అయితే కేవలం 49 రోజులకే ఆప్ ప్రభుత్వం రాజీనామా చేసింది. జన్ లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టి ఆప్‌ ప్రభుత్వం.. దాని ఆమోదానికి ఇబ్బందులు ఎదురు కావడంతో రాజీనామా ప్రకటించారు. 2017 ఎన్నికల్లో ఆప్‌ భారీ విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలో 77 నియోజకవర్గాలు ఉంటే అందులో 57 నియోజకవర్గాలు కైవశం చేసుకుంది. 2020లో మళ్లీ ఆప్ విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి కేజ్రీవాల్ పోటీచేసి ఓడిపోయారు. ఢిల్లీకి అధికారి పరిధి, నియామకాలు వంటి విషయాల్లో అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు లెఫ్టినెంట్‌ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతోను కేజ్రీవాల్ పెద్ద పోరాటమే చేశారు.

ముఖ్యమంత్రిగా ఢిల్లీలో విద్య, ఆరోగ్యం, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పనపై కేజ్రీవాల్ ప్రధానంగా దృష్టి సారించారు. ఢిల్లీ వ్యాప్తంగా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మొహల్లా క్లినిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. నెలకు 20వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం అందించింది. విద్యుత్తును కూడా సబ్సిడీ ధరలపై అందించింది. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారిగా పనిచేశారు. సమాచార హక్కు చట్టాన్ని క్రియాశీలకంగా ఆయన వినియోగించుకున్నారు. 2006లో రామన్ మెగసెసే అవార్డు పొందడంతో ఆయన పేరు ప్రఖ్యాతి పొందింది.

Exit mobile version