Site icon vidhaatha

Kiren Rijiju | 18వ లోక్‌సభ సమావేశాలు మొదలయ్యే తేదీపై కిరిణ్‌ రిజిజు క్లారిటీ

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం అవుతాయని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఈ సమావేశాలు జూలై మూడవ తేదీ వరకూ కొనసాగాయన్నారు. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం ఈ సమావేశాల్లో ఉంటుందని ఎక్స్‌లో తెలిపారు. తొలి మూడు రోజుల సమావేశాల సందర్భంగా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. స్పీకర్‌ ఎన్నిక కూడా ఇదే సెషన్‌లో ముగుస్తుంది. జూన్‌ 27న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను ఆమె తన ప్రసంగంలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

జూన్‌ 27 నుంచే రాజ్యసభ 264వ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయని కిరణ్‌ రిజిజు వెల్లడించారు. అవి కూడా జూలై మూడు వరకు కొనసాగుతాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం తన నూతన క్యాబినెట్‌ మంత్రులను ప్రధాని మోదీ పరిచయం చేస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య వాడివేడి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలక అంశాలపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ ఉభయ సభల్లోనూ సమాధానం ఇస్తారు.

Exit mobile version