- వాటికే స్థానిక సమస్యలపై అవగాహన
- జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులు మేం చూస్తాం
- ఏనుగుల మరణాలపై కేసులో సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇప్పటికే ఇంటెరిం అప్లికేషన్లు, పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుంటే.. స్థానిక సమస్యలపైనా తమ వద్దకే వస్తే ఎలాగని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు పనిపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతున్నదని వ్యాఖ్యానించింది. సమస్యలు వెయ్యి ఉండొచ్చుగానీ.. ప్రతిదానికీ సుప్రీంకోర్టుకు రావడం సరికాదని పేర్కొన్నది.
ఇది సుప్రీంకోర్టు తన పని తాను చేయకుండా అడ్డుకోవడమే అవుతుందని పిటిషన్ వేసిన న్యాయవాదిని మందలించింది. ముఖ్యమైన అంశాలపై సుప్రీంకోర్టు దృష్టిపెడుతుందని, ప్రతిదానిపై తాము చర్చ చేయాలంటే అది సమయం వృథా కావడం తప్ప మరేమీ ఉండదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
కేరళలో ఫిబ్రవరి 2019 నుంచి నవంబర్ 2022 మధ్య సంరక్షణ కేంద్రాల్లో ఉన్న ఏనుగుల్లో 135 చనిపోయాయని, వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇవి చనిపోయాయని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది కేరళకు సంబంధించిన విషయం కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. స్థానిక పరిస్థితులపై ఆయా రాష్ట్రాల హైకోర్టులకే ఎక్కువ అవగాహన ఉంటుందని పేర్కొన్నది.
ఒకవేళ హైకోర్టులు ఏమైనా తప్పులు చేస్తే వాటిని సుప్రీం కోర్టు సరిచేస్తుందని తెలిపింది. ప్రతి ఒక్క సమస్యను సుప్రీంకోర్టులో చర్చించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ముఖ్యమైన సమస్యలు ఇక్కడ సుప్రీంకోర్టులో విచారణకు వస్తాయి. మేము దేశం అంతా చూడాల్సిన అవసరం ఉంది. అటువంటి సమస్యలకు సమయం కేటాయించడం ముఖ్యం’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. బెంచ్‌లో జస్టిస్ జేవీ పార్థివాల, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.