Mamata Banerjee : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను దేవుడే పంపాడంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆమె మోదీని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేవుళ్లు రాజకీయాలు చేయరని, చేసినా అల్లర్లను ప్రేరేపించరని దీదీ విమర్శించారు.
‘దేశ ప్రయోజనం కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ దేవుళ్లు రాజకీయాలు చేయరు. చేసినా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా ఆయన తనను దేవుడిగా భావిస్తే నేనొక్క విన్నపం చేసుకుంటున్నా. మోదీజీ.. మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా (గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’ అని దీదీ ఎద్దేవా చేశారు.
‘నేను ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానులతో కలిసి పనిచేశా. అందులో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఉన్నారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు’ అని మమత వ్యాఖ్యానించారు.