విధాత : తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కరూర్ తొక్కిసలాట ఘటన నేపధ్యంలో టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన పార్టీ అధ్యక్షుడు విజయ్ రాజకీయ పర్యటనలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. విజయ్ పర్యటనలు రెండు వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించింది. తొక్కిసలాట ఘటనతో దిగ్బ్రాంతికి గురైన విజయ్ ప్రస్తుత తరుణంలో రాజకీయ పర్యటనలు కొనసాగించడం సరైంది కాదని భావించడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కరూర్ లో విజయ్ ప్రచార సభలో నెలకొన్న తొక్కిసలాట ఘటనలో 41మంది ప్రాణాలు కోల్పోగా..మరో 9మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్ నియమించింది. ఇటు తొక్కిసలాట ఘటన వెనుకు రాజకీయ కుట్ర కోణం ఉండవచ్చని టీవీకే ఆరోపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు విజయ్ సైతం ఇదే ఆరోపణలు చేస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తొక్కిసలాట ఘటన కేసును అడ్డుపెట్టుకుని టీవీకే నాయకలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ సీఎం స్టాలిన్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని విజయ్ ఆరోపించారు.