మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో ధ్యానం
విధాత : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కన్యాకుమారిలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం రాక్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యాన్ మండపంలో ధ్యానం చేయనున్నారు. అందుకు ఇక్కడి ధ్యాన మండపం వేదిక కానుంది. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తుది ఘట్టం ఏడో విడత ఎన్నికల ప్రచారం ఈనెల 30వ తేదీతో ముగియనుంది.
ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరుగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. రెండు నెలలకు పైగా దేశ వ్యాప్తంగా ఎన్డీఏ తరుపునా అలుపెరగని రీతిలో ప్రధాని మోదీ విస్తృత ప్రచారం నిర్వహించారు. స్వయంగా మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుండగా, మే 30తో ప్రచారం ముగుస్తుంది. అదే రోజున మోదీ కన్యాకుమారి చేరుకుని రేయింబవళ్లు ధ్యానంలో కూర్చుంటారని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టడం కొనసాగిస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల ప్రచారం అనంతరం కేదార్‌నాథ్‌ను సందర్శించారు, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు