Self Surgery : ఈ మధ్య ప్రతి పనికీ యూట్యూబ్ వీడియోలు చూడటం, వాటిని ఆధారం చేసుకుని సదరు పనులు చక్కబెట్టుకోవడం కామన్‌గా మారింది. వంటల సంతగతైతే చెప్పనక్కర్లేదు.. ఎక్కడెక్కడి వంటలో యూట్యూబ్‌లో చూసి వండేస్తున్నారు. ఇన్ని పనులు యూట్యూబ్ చూసి చేసుకుంటుండగా లేనిది.. ఆపరేషన్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనుకున్నాడు యూపీలోని రాజబాబు అనే 32 ఏళ్ల యువకుడు. తన కడుపు నొప్పి తగ్గడానికి అతడు తిరగని హాస్పిటల్ లేదు. ఎక్కడికి వెళ్లినా, ఎంతమంది వైద్యులను కలిసినా నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక ఆ నొప్పి పనిపట్టాలని నిశ్చయించుకుని, తానే అందుకు స్వయంగా పూనుకొన్నాడు. అంతే.. మెడికల్ షాప్ వద్దకు వెళ్లి.. తనకు కావాల్సిన మందులు, ఆపరేషన్ సామగ్రి, కత్తులు, కుట్లు వేసే మెటీరియల్.. అన్నీ కొనుక్కొచ్చాడు. అనెస్థీషియా ఇంజెక్షన్ కూడా కొన్నాడు.
అప్పటికే కడుపు నొప్పికి ఆపరేషన్ ఎలా చేస్తారో యూట్యూబ్‌లో అనేక వీడియోలు చూశాడు. ఇక తాను డాక్టర్ అయిపోయినట్టేనన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత.. తన గదిలోకి వెళ్లి తనకు తానే ఆపరేషన్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు. పొట్టలో నొప్పి వస్తున్న భాగం దగ్గర కోశాడు. కానీ.. పరిస్థితి రివర్స్ అయింది. విపరీతంగా రక్తస్రావం అయింది. అనెస్థీషియా ప్రభావం తగ్గిపోవడంతో శస్త్రచికిత్స కోసం కోత పెట్టిన ప్రాంతంలో భరించలేని నొప్పి మొదలైంది. దానిని ఓర్చుకోలేక పొడబొబ్బలు పెట్టాడు. అతడి కేకలు విని గదిలోకి వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడి పరిస్థితిని చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే కోలుకుని.. అతడిని హుటాహుటిన మథురలోని ఒక హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి విషమించడంతో ఆగ్రాలోని ఎస్ ఎన్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తానే శస్త్ర చికిత్స చేసుకునేందుకు సిద్ధపడ్డాడని అతడి మేనల్లుడు రాహుల్ ఫోన్‌లో ధ్రువీకరించినట్టు ఇండియా టుడే టీవీ పేర్కొన్నది. అతడే ఆయనను హాస్పిటల్‌లో చేర్పించాడు. తన మామకు 18 ఏళ్ల క్రితం అపెండిక్స్ సర్జరీ జరిగిందని చెప్పాడు. కొద్ది రోజులుగా విపరీతమైన పొట్ట నొప్పితో బాధ పడుతున్నాడని తెలిపాడు. అనేక మంది డాక్టర్లను సంప్రదించినా నొప్పి తగ్గకపోవడంతో తనంతట తానే శస్త్ర చికిత్స చేసుకునేందుకు సిద్ధపడ్డాడని వెల్లడించాడు. వంటలు చేసుకోవడానికి లేదా ఇతరత్రా పనులు చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోలను వాడుకోవాలి గానీ.. ఇలా సొంత వైద్యానికి పూనుకొంటే ప్రాణం మీదకు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు మానుకోవాలని సలహా ఇస్తున్నారు. బహుశా రాజబాబుకు అంతకు ముందు ఇలాంటి వార్నింగ్‌లు ఎవరూ ఇవ్వలేదేమో.. ఇచ్చినా యూ ట్యూబ్ వీడియోల విజ్ఞానం ముందు వాళ్ల వార్నింగ్‌లు ఏమిటనుకున్నాడో.. చివరికి మాత్రం హాస్పిటల్ బెడ్‌పై బిక్కుబిక్కుమంటున్నాడు!