Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి, సినిమా విడుదలకు ముందు మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్ కారణంగా కొంతకాలం పాటు బయటకు రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఆయన భుజానికి (షోల్డర్) కూడా చిన్న శస్త్రచికిత్స జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆ ఫోటోలో చిరంజీవి భుజానికి సపోర్ట్‌గా షోల్డర్ బ్యాగ్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఫోటోను హీరో అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన పెళ్లి మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందజేసిన సందర్భంగా తీసిన ఈ ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించడం గమనార్హం. దీంతో “చిరంజీవికి ఏమైంది?”, “ఆరోగ్యం బాగానే ఉందా?” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవికి పెద్దగా ఎలాంటి ప్రమాదం లేదని, భుజానికి చిన్న శస్త్రచికిత్స మాత్రమే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ త్వరగా కోలుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఆయన తదుపరి సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి చిరంజీవి పూర్తిగా ఫిట్‌గా తిరిగి వస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా విశేషం ఏమిటంటే, ఇటీవల చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌కి వచ్చిన అభిమానులతో కూడా ఫోటోలు దిగారు. భుజానికి నొప్పి ఉన్నప్పటికీ షోల్డర్ బ్యాగ్‌ను పక్కన పెట్టి ఓపికగా అభిమానులతో మాట్లాడటం, ఫోటోలు ఇవ్వడం మెగాస్టార్ మంచితనాన్ని చాటి చెప్పింది. 70 ఏళ్ల వయసులోనూ అభిమానుల కోసం అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి అంకితభావం అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. చిన్న శస్త్రచికిత్సలు జరిగిన ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తిరిగి కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతుండటం ఆయన పట్టుదలను మరోసారి నిరూపిస్తోంది.
