Capsicum Farming | మహారాష్ట్ర( Maharashtra ) పుణె జిల్లా( Pune District )లోని జున్నార్ తాలుకా పరిధిలోని కల్వాడి( Kalwadi ) గ్రామానికి చెందిన ప్రణిత వమన్( Pranita Vaman ).. పుణెలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్( MBA Agribusiness Management )లో పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ( Food Processing Company )లో పని చేశారు. అప్పుడే ఆమె రియలైజ్ అయింది. ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే.. తానే స్వయంగా ఓ పది మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని. అనుకున్నదే తడువుగా.. తన ఎంబీఏ అయిపోగానే.. తన పొలంలో క్యాప్సికం సాగు( Capsicum Farming ) ప్రారంభించింది.
ప్రణిత తండ్రి వృత్తి రీత్యా టీచర్. ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. కూరగాయలు, పండ్లు పండించేవాడు. దీంతో ఆమె కూడా తన తండ్రిలా అన్నదాతగా మారింది. ఇక క్యాప్సికంకు భారీగా డిమాండ్ ఉండడంతో.. ఆ పంటనే సాగు చేయాలని ప్రణిత నిర్ణయించుకుంది. ఇందుకు పాలీహౌస్( Poly house ) ముఖ్యమని భావించింది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను తట్టుకోని.. అధిక దిగుబడి పొందొచ్చు. ఏడాదంతా క్యాప్సికంను కొనుగోలు చేస్తూనే ఉంటారు.
ప్రణిత.. 2020 మార్చిలో ఒక ఎకరా పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. అది కూడా పాలిహౌజ్ విధానంలో. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇవ్వగా, ఆమె సొంతంగా మరో రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టింది. డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేసింది. బారామతి నుంచి క్యాప్సికం మొక్కలను సుమారు 12000 వరకు కొనుగోలు చేసింది. ఒక్కో మొక్క ధర రూ. 10. ఈ మొక్కలన్నింటినీ 2020 మార్చిలో నాటింది. జూన్, జులై మాసం నాటికి క్యాప్సికం పంట చేతికి అందింది. 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ అప్పుడే కరోనా లాక్ డౌన్ విధించారు. దీంతో క్యాప్సికంను ఎక్కడా విక్రయించాలో ప్రణితకు తోచలేదు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల వివరాలు సేకరించింది. మొత్తానికి ఓ వ్యాపారి క్యాప్సికం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఇక 40 టన్నుల క్యాప్సికంను కిలో రూ. 80 చొప్పున విక్రయించింది ప్రణిత. అంటే రూ. 32 లక్షల టర్నోవర్ వచ్చింది. ఆమె పెట్టుబడి రూ. 20 లక్షలు పోనూ.. లాభం 12 లక్షలు మిగిలింది. ఇదంతా మొదటి ఏడాది సంపాదన మాత్రమే. ఈ లాభం ఎంతో సంతృప్తిని తెచ్చిపెట్టిందని ప్రణిత పేర్కొంది. 2021లో రెండు ఎకరాలకు తన సాగును విస్తరించింది. ఇప్పుడు 25 ఎకరాల్లో పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు చేస్తున్నట్లు ప్రణిత తెలిపింది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం క్యాప్సికం ధర మార్కెట్‌లో కిలో రూ. 100 చొప్పున ఉంది. 25 ఎకరాల్లో పండించిన క్యాప్సికం పంటకు ఏడాదికి రూ. 4 కోట్లు సంపాదిస్తున్నట్లు ప్రణిత తెలిపింది. ఇందులో ఖర్చులు పోనూ ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభం వస్తున్నట్లు స్పష్టం చేసింది యువ మహిళా రైతు.