విధాత: పండుగల సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు యజమాన్యాలు బోనస్ లు, బహుమతులు అందించడం చూస్తుంటాం. అయితే హర్యానాలోని పంచకులా కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మిట్స్ నేచురా లిమిటెడ్ యజమాని ఎంకే భాటియా మాత్రం ఈ సాంప్రదాయాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. ప్రతి దీపావళికి తన కంపెనీ ఉత్తమ ఉద్యోగులకు సర్ ప్రైజ్ గిఫ్టులను అందించే భాటీయా గత రెండేళ్లుగా కార్లను దీపావళి కానుకలుగా అందించారు. ఈసారి దీపావళి సందర్భంగా కూడా ఏకంగా 51మంది ఉద్యోగులకు కొత్త కార్లను కానుకగా అందించి సంచలనం సృష్టించారు.
పండుగ వేళ తమకు అందిన కార్లు కానుకలను చూసుకున్న కంపెనీ ఉద్యోగుల సంతోషం దీపావళీ మతాబుల్లా వెలుగులు విరజిమ్మింది. యజమాని నుంచి కొత్త కార్ల తాళాలు అందుకున్న ఉద్యోగులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కంపెనీలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఉద్యోగులు తమ ఆనందానికి గుర్తుగా..యజమానికి కృతజ్తతగా నగరంలో కార్ గిఫ్ట్ ర్యాలీ నిర్వహించారు. కంపెనీ కార్యాలయం నుంచి మిట్స్ హౌస్ వరకు ఊరేగింపుగా వెళ్లారు. 2023లోనూ యజమాని భాటియా ఉద్యోగులకు టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను పండుగ బహుమతిగా ఇచ్చారు. ‘స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన 15 మంది కంపెనీ ఉద్యోగులకు అక్టోబరు 14న ఈ కానుకలను అందించారు. 2024లో సైతం అత్యుత్తమ పనితీరు కనబర్చిన 12 మంది ఉద్యోగులకు ఇలాగే కార్లను అందించారు.
అందుకే కార్ల కానుకలు : భాటియా
నా ఉద్యోగులే నా కంపెనీకి వెన్నుముక అని..వారి కృషితోనే కంపెనీ ఎదుగుతుందని అందుకే వారికి ప్రోత్సాహకంగా కానుకలు అందిస్తున్నానని యజమాని భాటియా తెలిపారు. ఉద్యోగలు కష్టం, నిజాయితి, అంకితభావంతోనే మిట్స్ నేచురా ప్రగతికి పునాదులు అని స్పష్టం చేశారు. వారికి కానుకలు ఇవ్వడమంటే ప్రదర్శన కాదు అని..టీమ్ స్పిరిట్ ను పెంపొందించే మార్గమన్నారు. టీమ్ సంతోషంగా ఉంటే..కంపెనీ మెరుగ్గా ముందుకెలుతుందన్నారు. అటు ఆ కంపెనీ ఉద్యోగులు కూడా ఆయన మాకు కేవం బాస్ మాత్రమే కాదని..మా కుటుంబ పెద్దలాంటి వారంటూ కొనియాడారు.