తల్లి ఆస్తి కోసమే వారసత్వ పన్ను రద్దు చేసిన రాజీవ్‌

ఇందిరాగాంధీ మరణానంతరం తన తల్లి ఆస్తి మొత్తం తనకే రావాలనే ఆలోచనతోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1985లో వారసత్వ ఆస్తి పన్నును రద్దు చేశారని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఆరోపించారు

  • Publish Date - April 25, 2024 / 08:12 PM IST

  • మధ్యప్రదేశ్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ
  • 1970లోనే ఇందిర తన ఆస్తి మొత్తాన్నీ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌కు ఇచ్చేశారు
  • ప్రధాని నోరు తెరిస్తే అబద్ధాలేనన్న కాంగ్రెస్‌

మొరేనా: ఇందిరాగాంధీ మరణానంతరం తన తల్లి ఆస్తి మొత్తం తనకే రావాలనే ఆలోచనతోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1985లో వారసత్వ ఆస్తి పన్నును రద్దు చేశారని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన మోదీ.. మరోసారి అసత్యాలు వల్లెవేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. వారసత్వ సంపదపై పన్ను అంశం పిట్రోడా వ్యాఖ్యలతో చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా బుధవారం ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడిన మోదీ.. ప్రజల ఆస్తులను గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మరోసారి దాడి చేశారు. వారి విషయం (ఇందిర, రాజీవ్‌) పరిష్కారం అయిపోగానే.. ఈరోజు అధికార దాహంతో వీళ్లు అదే చట్టాన్ని మరింత కఠినంగా తీసుకురావాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ప్రజలు సంపదించుకున్న ఆస్తులు, మంగళసూత్రాలు చనిపోయిన తర్వాత కూడా గుంజుకుంటారని విమర్శించారు. కుల గణన దేశానికి ఎక్స్‌రే వంటిదని రాహుల్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్‌ చేస్తూ.. ఇప్పుడు మీ ఆస్తులపై మీ అల్మరాల్లో ఎక్కడెక్కడ ఆస్తులు దాచారో ఎక్స్‌రే తీయాలని వ్యాఖ్యానించారు. అయితే.. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ ఆస్తి పన్ను తేవాలని అనుకుంటున్నదని నిన్న ప్రధాని చెప్పారు. ఇప్పుడు బీజేపీయే వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నదని, మోదీ వైఖరి మార్చారని ఆరోపించారు. అసలు వారసత్వ ఆస్తి పన్ను రద్దు చేసిన సమయంలో నాటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్‌ బడ్జెట్‌ ప్రసంగం పాఠాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అన్నింటికి మించి.. ఇందిరాగాంధీ తాను చనిపోవడానికి ముందే 1970లోనే తన పూర్వీకుల ఆస్తి మొత్తాన్నీ జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌కు ఇచ్చేశారని జైరాంరమేశ్‌ వెల్లడించారు. ప్రధాని ఎప్పుడు నోరు తెరిచినా అబద్ధాలే మాట్లాడుతారని మండిపడ్డారు. ప్రధానమంత్రి తన నీచత్వం, కుత్సిత మనస్తత్వం, అబద్ధాలకు కట్టుబడి ఉంటారనేందుకు తాజాగా సాక్ష్యాన్ని అందించారని వ్యాఖ్యానించారు.

Latest News