Site icon vidhaatha

PM Modi | రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ.. 17వ లోక్‌సభ రద్ధు చేయాలని వినతి

ప్రధాని పదవికి మోదీ రాజీనామా
ఆమోదించిన రాష్ట్రపతి
జూన్ 7న ఎన్డీఏ, బీజేపీ పార్లమెంటరీ పార్టీల పక్షాల సమావేశం
8వ తేదీన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం

విధాత : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ 17వ లోక్‌సభ రద్ధు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యినందునా 18వ లోక్‌సభ కొలువు తీరేందుకు వీలుగా 17వ లోక్‌సభను రద్ధు చేయాలని కోరారు. అలాగే ప్రధాని పదవికి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి మోదీ రాజీనామాను ఆమోదించి అపద్దర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బుధవారం నాలుగు గంటలకు మోదీ నివాసంలో ఎన్డీఏ మిత్ర పక్షాలు భేటీ కాబోతున్నాయి. ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తన భార్య అన్నా లేజ్నోవా, కుమారుడు అకీరాతో కలిసి మరో విమానంలో ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. నితీశ్ విమానంలోనే ఇండియా కూటమి నేత తేజస్వీ యాదవ్ ఉండటంతో మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అయితే నితీశ్ వాటన్నింటిని తోసిపుచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటూ స్పష్టం చేశారు.

కేంద్రంలో బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో మెజార్టీ మార్కు 272సీట్లు సొంతంగా రాకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి మోదీకి, బీజేపీకి ఏర్పడింది. మిత్రపక్షాల్లో ఎక్కువ ఎంపీలు కలిగిన టీడీపీ, జేడీయూలు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. జూన్ 7న ఎన్డీఏ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ పక్ష నేతను ఎన్నుకుంటారు. అలాగే ఇదే సమావేశంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ కూర్పుకు సంబంధించిన చర్చలు జరుగనున్నాయి.

Exit mobile version