Site icon vidhaatha

Nepal PM Oli Resigns : రాజకీయ సంక్షోభంలో నేపాల్.. ప్రధాని కేపీ ఒలీ రాజీనామా

Nepal KP Sharma Oli Resigns

Nepal PM Oli Resigns :  నేపాల్ (Nepal)లో తాజాగా చెలరేగిన అల్లర్లు ఆ దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. సోషల్‌ మీడియా (Social Media)పై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారిపోయాయి. మృతుల సంఖ్య 19కి పెరిగింది. అల్లర్లను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దేశ వ్యాప్తంగా జోరుందుకున్న నిరసనలు రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని కేపీ శర్మ ఒలీ(PM KP Sharma Oli) మంగళవారం (సెప్టెంబర్‌ 9 2025) తన పదవికి రాజీనామా చేశారు. తన బాధ్యతలను ఉప ప్రధానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆయన దుబాయ్ ప్రభుత్వం ఆశ్రయం కోరారు. నేపాల్ ఆర్మీ సూచన మేరకు ఒలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయనను సురక్షితంగా దేశం విడిచి పెట్టేందుకు నేపాల్ ఆర్మీ అనుమతించింది. ఆయన దుబాయికి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశముంది. దేశంలో ఆందోళనలు ఉదృతమైన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపారు.

అదుపులోకి రాని అల్లర్లు..మంత్రుల వరుస రాజీనామాలు

అల్లర్లను అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా కర్ఫూ విధించారు. అయినప్పటికి ఆందోళన కారులు తగ్గేదేలే అంటూ పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌(Ram Chandra Paudel) ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకుని వాటికి నిప్పు పెట్టారు. ప్రధాని ఓలీ అధికారిక నివాసంపై దాడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. మాజీ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ (ప్రచండ) నివాసంపైనా నిరసనకారులు దాడి చేశారు. పలువురు మంత్రుల నివాసాలకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. నేపాల్(Nepal) ఆర్థిక మంత్రి, హోం మంత్రులపై ఆందోళన కారులు దాడులకు తెగబడ్డారు. రాజీనామా చేసిన హోం మంత్రి రమేశ్‌ లేఖక్‌(Home Minister Ramesh Lekhak) నివాసానికి నిప్పంటించారు. నేపాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవుబా(Sher Bahadur Deuba) నివాసాన్ని చుట్టుముట్టి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్‌ యాదవ్‌ కూడా రాజీనామా ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా మంత్రులను వారి నివాసాల నుంచి మిలిటరీ ఖాళీ చేయించి, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇండియా–నేపాల్‌ సరిహద్దులో హై అలర్ట్‌

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్ల నేపథ్యంలో భారత్‌–నేపాల్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సైతం తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నేపాల్‌ అధికార పక్షానికి చెందిన అనేక మంది కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో ఉన్నారన్న సమాచారంతో నిరసనకారులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కఠ్మాండు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఇండియాలోని లక్నోలో ల్యాండ్‌ చేయాల్సిందిగా ఆ విమానయాన సంస్థకు ఆదేశాలు వెళ్లాయి.

నిషేధం తొలగింపు

ప్రస్తుత అల్లర్లకు కారణమైన సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని నేపాల్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి పనిచేశాయి. నేపాల్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని ఎన్సీకి చెందిన గగన్‌ థాపా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘రాత్రంతా నిద్రపోలేదు. నేనే కాదు.. నేపాల్‌ మొత్తం ఇదే పరిస్థితి. బయట ఉన్న నేపాల్‌ వారూ కూడా నాకులా నిద్రపోలేదు. అమాయకులైన యువత అన్యాయంగా చనిపోతున్న దృశ్యాలు నా కళ్లముందు తిరుగాడుతూనే ఉన్నాయి. ప్రధాని దీనికి బాధ్యత తీసుకోవాలి. వెంటనే రాజీనామా చేయాలి. నేపాలీ కాంగ్రెస్‌ ఈ పరిస్థితిని మరొక్క రోజు కూడా చూస్తూ ఉండలేదు. ప్రభుత్వానికి నేపాలీ కాంగ్రెస్‌ వెంటనే మద్దతు ఉపసంహరించాలి’ అని ఆయన రాశారు.

Exit mobile version