విధాత: వృద్ధ దంపతులకు భోజనంలో మత్తు మందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు.
ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం ఉదయం వాకింగ్‌కు రాక పోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చంది. దీంతో అతను హేమరాజ్ ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్‌రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది.
ఏదో జరిగిందని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్‌రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డీసీసీ, ఎస్‌ఐ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.