సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు నేపాల్ లో హింసాత్మకంగా మారాయి. సోమవారం నాడు ఆందోళనకారులు పార్లమెంట్ గేటును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. నేషనల్ ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న 10 మంది పరిస్థితి విషమంగా ఉందని ఈ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ దీపేంద్ర పాండే మీడియాకు చెప్పారు. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తలకు, ఛాతీ, కాళ్లు, చేతులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని డాక్టర్ తెలిపారు. భన్వేశ్వర్ లోని ఎవరెస్ట్ ఆసుపత్రిలో ముగ్గురు చరిపోయారని డాక్టర్ అనిల్ తెలిపారు. ఇక్కడ 50 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆన్ లైన్ లో ప్రారంభమైన ఈ నిరసన సోమవారం వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టేవరకు చేరింది. ఈ ఆందోళనలకు జనరల్ జెర్స్ భారీ నాయకత్వం వహించారు. జెన్ జెడ్ విప్లవం పేరుతో ఖాట్మాండ్ లో వేలాది మంది నిరసనకు దిగారు. పోలీసుల నిషేధాలను ఉల్లంఘించారు. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పుకుల దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు నిరసనకారులున్న ప్రాంతాన్ని సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలో నమోదు చేసుకోవడంలో విఫలమైనందున యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ సహా 26 సోషల్ మీడియా సంస్థలపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించాలని ఈ నెల 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై జనరల్ జెడ్ నేతృత్వంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
సోమవారం పార్లమెంట్ వద్దకు నిరసనకారులు చేరుకొని పార్లమెంట్ గేటును ధ్వంసం చేశారు. పార్లమెంట్ లోపలికి వెళ్లారు. వారిని ఆపేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వాటర్ క్యానాన్లతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా కొందరు పార్లమెంట్ లోపలికి వెళ్లారు. స్వతంత్ర స్వరం మన హక్కు, ,పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎక్కడికి పోయింది అంటూ నినాదాలు రాసిన జెండాలు, ప్లకార్డులను పట్టుకొని నిరసనలో వందలాది మంది యువత పాల్గొన్నారు.
ప్రభుత్వంలో నమోదు కాని సోషల్ మీడియా సంస్థలపై నిషేధాన్ని ప్రధాని కెపి శర్మ ఓలి సమర్ధించారు. దేశాన్ని అణగదొక్కే ఏ ప్రయత్నాన్ని కూడా ఎప్పటికి సహించబోమని ఆయన అన్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అహంకారానికి, దేశాన్ని బలహీనపర్చే ఏ చర్యను పార్టీ అంగీకరించదని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని విస్మరించడం, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని అగౌరవపర్చడం ఆమోదం కాదని ఆయన అన్నారు.
దేశీయ, విదేశీ ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లు సంబంధిత అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కంటెంట్ ను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా కోరింది. దీంతో ఐటీ శాఖ సోషల్ మీడియా సంస్థలు తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న టిక్ టాక్ సహా ఐదు సంస్థలపై ఎలాంటి నిషేధం లేదు. యూట్యూబ్ , ఫేస్ బుక్ వంటి 26 సంస్థలు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. సంస్కృతి, సంప్రదాయాలు, కంటెంట్ విషయంలో ఆయా కంపెనీలదే బాధ్యత అని చట్టం చేసింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే నిషేధం విధించారనేది ఆందోళనకారుల వాదన. 13 నుంచి 28 ఏళ్ల వయస్సులోపు యువత జనరేషన్ జడ్ పేరుతో ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నేపాల్ కు చెందిన వారు ఎక్కువగా విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తారు. అయితే సోషల్ మీడియా ద్వారానే తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేస్తారు. అయితే సోషల్ మీడియా బ్యాన్ కారణంగా విదేశాల్లో ఉంటున్నవారికి ఇబ్బంది కలుగుతోందని నిరసనకారులు వాదిస్తున్నారు.