Zohran Mamdani Election Gen Z Revolution |  మమ్దానీ చరిత్రాత్మక విజయం.. జెన్‌ జీ రహస్య విప్లవం!

బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహాలో వారేమీ వీధి పోరాటాలు చేయలేదు.. హింసాకాండకు పాల్పడలేదు.. ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే విద్వేషాన్ని, విభజనవాదాన్ని ఓడించవచ్చని నిరూపించారు. వారే న్యూయార్క్‌ జెన్‌ జీ! నగర మేయర్‌గా జోహ్రానీ మమ్దానీ ఎన్నికలో వీరు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Zohran Mamdani Election Gen Z Revolution | జెన్‌ జీ! ఇటీవలి కాలంలో నిరంకుశ ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్న తరం! బంగ్లాదేశ్‌ పాలకులు తలొంచిందీ ఈ జెన్‌ జీకే.. నేపాల్‌, మడగాస్కర్‌ వంటి దేశాల్లో కలకలం రేపిందీ ఇదే జెన్‌ జీ! వారివి నాయకత్వాలు లేని వీధి పోరాటాలు! అన్యాయంపై ఆధునిక డిజిటల్‌ విస్ఫోటాలతో తక్షణం తిరగబడిన ఆరాటాలు. కానీ.. మమ్దానీ ప్రచారం మాత్రం.. సూక్ష్మమైన.. మౌలిక సదుపాయాల తిరుగుబాటును ప్రతిబింబిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మమ్దానీ 50 శాతానికి మించి ఓట్లు పొందడం గమనార్హం. దాదాపు 20 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇది 1969 తర్వాత ఇదే భారీ స్థాయి ఓటింగ్‌ కావడం గమనార్హం. తాజాగా ముందస్తుగా ఓటింగ్‌కు వచ్చినవాళ్లే 7.35 లక్షల మందిగా ఉన్నారు. ఇందులోనూ అత్యధికులు యువత, తొలిసారి ఓటు హక్కు పొందినవారే కావడం గమనార్హం. మమ్దానీ విజయంలో కీలక పాత్ర పోషించిందీ వీరే. ఇస్లామోఫోబియా, వలసవాద వ్యతిరేకత, శ్వేతజాతీయుల ఆధిపత్యం నిండిన అమెరికాలో మమ్దానీని ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగాయి. ఆయన జిహాదిస్టు, రాడికల్‌ అంటూ ట్రంప్‌, రిపబ్లికన్‌ నాయకురాలు ఎలిస్‌ మేరీ స్టెఫానిక్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వంటివాళ్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు. కానీ.. వాటన్నింటినీ తన విజయం ద్వారా మమ్దానీ తుత్తునియలు చేశారు. మొత్తంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం జెన్‌ జీ. అయితే.. ఇతర కొన్ని దేశాల్లో తరహాలో విధ్వంసాలకు దిగని జెన్‌ జీ.. విద్వేష రాజకీయాలను పద్ధతి ప్రకారం.. నిర్మాణాత్మకంగా ఓడించారన్న చర్చలు సాగుతున్నాయి.

న్యూయార్క్‌ నగర మేయర్‌గా జొహ్రాన్‌ మమ్దానీ గెలుపు చాలా విషయాలే చెబుతున్నది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వలసవాద వ్యతిరేక విధానాలు, ఇస్లామోఫోబియా, ఆర్థిక బలాత్కారాలకు తిరుగులేని వ్యతిరేకతగా చెబుతున్నారు. అమెరికా రాజకీయాల్లో భూకంపంగా వర్ణిస్తున్న మమ్దానీ గెలుపు వెనుక మరో కోణం కూడా ఉంది.. అదే జెన్‌ జీ విప్లవం.. కాకపోతే మరో తరహాలో! విభజన వాదాలతో విసిగిపోయిన, సమాజం, సామాజిక ప్రయోజనం, ప్రగతిశీల పాలన కోసం ఆరాటపడిన ఒక తరం చేసిన నిశ్శబ్ధ తిరుగుబాటుగా రాజకీయ విశ్లేషకులు మమ్దానీ విజయాన్ని అభివర్ణిస్తున్నారు. ఇది నేపాల్‌లో, బంగ్లాదేశ్‌లో, మడగాస్కర్‌లో మలుపు తీసుకున్నట్టు తక్షణ అగ్నిపర్వత విస్ఫోటం కాదు. దీని వెనుక దీర్ఘకాలిక శ్రమ, పట్టుదల, నిర్మాణం కనిపిస్తాయి. మమ్దానీ బృందంలో కీలక పాత్ర పోషించింది యువ వాలంటీర్లే. ఆయనకు వచ్చిన విరాళాలు కూడా చాలా చిన్న మొత్తాలే. డిజిటల్‌ కోఆర్డినేషన్‌ వారికి వరంలా అందింది. ఎన్నికల రాజకీయాలను సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించాలనే ఒక సంకల్పం నుంచి మమ్దానీ విజయాన్ని చూడాలంటున్నారు విశ్లేషకులు.

NYC Mayor mamdani | న్యూయార్క్‌ కాబోయే మేయర్‌ మామ్దానీపై ఇండియాలో భిన్న స్పందనలెందుకని?

‘మొబైల్‌ స్క్రీన్‌లకు బానిసలై, డబ్బు కోసం నానా కష్టాలు పడుతూ, ఆధ్మాత్మికంగా కూడా నిరాశలే ఎదురై, కొవిడ్‌ మహమ్మారితో సామాజికంగా కుంగిపోయిన యువ న్యూయార్క్‌ వాసులకు ఇంటి నుంచి బయటకు రావడానికి ఒక కారణం అవసరం. వారికి అది జోహ్రాన్‌ మమ్దానీ మేయర్‌ ఎన్నికల్లో లభించింది’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన వాదన వినిపించింది. దేశంలో పాతుకుపోయిన రాజకీయాలకు, వాగ్దాటితో విభజనవాదాన్ని రెచ్చగొడుతున్న తీరుకు వ్యతిరేకంగా మమ్దానీ చేసిన ప్రచారం.. అంతర్లీనంగా ఆగ్రహంతో ఉన్న ఓటర్లను ఆకర్షించిందని చెబుతున్నారు. కారణం.. ప్రజల ప్రత్యేకించి యువత దైనందిన జీవితాలను నిర్దేశిస్తున్న సమస్యలకు– గృహ స్థోమత, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, సామాజిక ఒంటరితనాలకు– మామ్దానీ సాహసోపేతమైన ఆచరణాత్మక పరిష్కారాలు సూచించడమేనని అంటున్నారు. సమానత్వం, న్యాయంతో కూడిన సమ్మిళిత పాలన అనే జన్‌జీ డిమాండ్‌ను మమ్దానీ అందిపుచ్చుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి మమ్దానీ తన ఎన్నికల ప్రచారాన్ని 2024 చివరిలోనే ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనకు మద్దతు పలికేవారి సంఖ్య సింగిల్‌ డిజిట్‌లోనే ఉండేది. కానీ.. మమ్దానీ తన ప్రత్యామ్నాయ విధానాలతో వేల మంది వాలంటీర్లను సమీకరించుకోగలిగారు. చిన్ని చిన్న విరాళాలతోనే ప్రచారాన్ని సాగించారు. ప్రధానంగా ప్రగతిశీల శక్తులు, జెన్‌ జీ, దక్షిణాసియా కమ్యూనిటీలను చేరుకునేందుకు సామాజిక మాధ్యమాలను శక్తివంచన లేకుండా వినియోగించుకున్నారు. దీంట్లో మమ్దానీకి రెండు అంశాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ఒకటి.. ప్రచార క్యాంపెయిన్‌లో జెన్‌ జీని సమీకరించింది. షిఫ్టులవారీగా చేసిన ప్రచారం.. వాలంటీర్‌ నైట్స్‌ ద్వారా యువ న్యూయార్కర్లతో కనెక్ట్‌ అవ్వగలిగారు. రెండో అంశం.. ఓటింగ్‌ శాతాన్ని ఇది గణనీయంగా పెంచింది. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్కులు పెద్ద ఎత్తున ఓటింగ్‌ తరలిరావడం ప్రగతిశీల బలమైన ప్రాంతాల్లో మమ్దానీకి మొగ్గు చూపింది.

న్యూయార్క్ నగరానికి మమ్దానీ మొట్ట మొదటి ముస్లిం మేయర్‌. గతంలో అంటే.. 1990–93 కాలంలో డేవిడ్‌ డిన్‌కిన్స్‌ను అమెరికా చరిత్రలోనే తొలి డెమోక్రటిక్‌ సోషలిస్టుగా అభివర్ణించారు. ఆ తర్వాత ఆ ప్రఖ్యాతి మమ్దానీకి దక్కింది. ఇంకా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. దక్షిణాసియా దేశం నుంచి వచ్చి తొలి మేయర్‌ మమ్దానీ. గడిచిన వంద ఏళ్లలో మమ్దానీ వయసు మేయర్‌ న్యూయార్క్‌కు లేరు. ఉగాండాలో జన్మించిన మమ్దానీ నేపథ్యం కూడా వలసవాద అంశాన్ని ప్రభావితం చేసింది. భారత దేశం నుంచి వలస వచ్చిన దంపతులకు పుట్టిన మమ్దానీ.. చిన్నప్పుడే అమెరికాకు వచ్చారు. ఆయన తల్లి ప్రఖ్యాత బాలీవుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌. పునాది స్థాయి నుంచీ ఎదుగుతూ డెమోక్రటిక్‌ సోషలిస్ట్‌ ఆఫ్‌ అమెరికాకు తనకు తాను గుర్తింపు పొందారు.

Read Also |

Man Plays With Alligator Under Water | ఎంత ధైర్యమో..నీళ్లలో మొసలితో ఆటలు!
Jubilee Hills Bypoll | జూబ్లీ వార్‌లో కేసుల సవాల్! కేసులు ఎవరిపై? అరెస్టులు చేసేదెవరు?
Monalisa | తెలుగు మూవీలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా!
Tirumala : తిరుమల రెండో ఘాట్ లో పెద్ద కొండచిలువ కలకలం