NTA | నీట్ ఫలితాలపై విచారణకు కమిటీ.. ఎన్టీఏ కీలక ప్రకటన

దేశ వ్యాప్తంగా నీట్ -2024పరీక్షల ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

  • Publish Date - June 8, 2024 / 05:38 PM IST

విధాత, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నీట్ -2024పరీక్షల ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ కంపెన్సేటరీ మార్పుల వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేసినట్లుగా ప్రకటించింది. మార్కుల మంజూరీపై నెలకొన్న వివాదంపై కమిటీ విచారణ చేసి పరిష్కరిస్తుందని పేర్కోంది. దేశ వ్యాప్తంగా 24లక్షల మంది నీట్ పరీక్షలు రాశారు. ఫలితాలపై 1600మంది విద్యార్థులు చేసిన ఫిర్యాదులను కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది.

అక్రమాలపై భగ్గుమంటున్న విద్యార్థి లోకం నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ రాగా, ఇందులో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం, వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు రేగుతున్నాయి. అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయి. అలా చూసుకుంటే ఆమెకు 636 మార్కులు రావాలి. కానీ 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయి. (+4, -1) విధానాన్ని నీట్ ఎగ్జామ్లో ఫాలో అవుతుందని, అలా చూసుకుంటే 718, 719 మార్కులు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

ఈ నీట్ ఎగ్జామ్ వివాదంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని, ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, అందువల్ల రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించి.. 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని వివరించింది. కానీ కొంత మంది విద్యార్థులకు 100 పైగా గ్రేస్ మార్కులు కలిపారు. అలాగే ముందుగా జూన్ 14వ తేదీన విడుదల చేస్తానన్న ఫలితాలు జూన్ 4వ తేదీన ఎలక్షన్ కౌంటింగ్ రోజు విడుదల చేయటంతో ఎన్నో సందేహాలు రేగుతున్నాయి. పేపర్ లీక్ అవ్వటం వల్లనే ఎగ్జామ్ రాసిన ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయారని.. వారికి న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News