విధాత, హైదరాబాద్ : నీట్-యూజీ 2024 పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలపై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను శనివారం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది. సుప్రీం ఆదేశాల మేరకు నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించడంతో పాటు విద్యార్ధుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ‘ఫలితాలను ఎన్టీఏ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్టీఏ శనివారం ఫలితాలను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని ఒక బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని కోర్టు గత విచారణలో స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కావడం..కొన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం ఆలస్యంగా ఇవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫలితాల్లో 1563మందికి ప్రశ్నపత్రం ఆలస్యం కారణం పేరుతో గ్రేస్ మార్కులు కలిపారు. దీంతో ఏకంగా 67మంది విద్యార్థులకు 720కి 720మార్కులతో టాప్ ర్యాంక్‌లు దక్కాయి. దీంతో పరీక్ష నిర్వాహణే లోపభూయిష్టంగా జరిగిందన్న ఆరోపణలతో పాటు ప్రశ్నపత్రం లీకేజీ కూడా జరగడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.