Rahul Gandhi | నీట్‌ అంశాన్ని ప్రస్తావిస్తున్న రాహుల్‌ మైక్‌ కట్‌

24 లక్షల మంది ఎదుర్కొంటున్న కీలక సమస్యకంటే సభాసంప్రదాయాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావించడంతో శుక్రవారం పార్లమెంటు సమావేశాలు దద్దరిల్లాయి.

  • Publish Date - June 28, 2024 / 05:47 PM IST

సత్వరమే నీట్‌పై చర్చించాలన్న ప్రతిపక్ష నేత
విద్యార్థులకు సంఘీభావం చాటాలని వినతి
ముందు సభ నియమాలు, సంప్రదాయాలు పాటించాలి
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ తర్వాతే నీట్‌పై
తేల్చి చెప్పిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

న్యూఢిల్లీ : 24 లక్షల మంది ఎదుర్కొంటున్న కీలక సమస్యకంటే సభాసంప్రదాయాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావించడంతో శుక్రవారం పార్లమెంటు సమావేశాలు దద్దరిల్లాయి. శుక్రవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే నీట్‌ అంశం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో అవకతవకల అంశంపై అత్యవసరంగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా సభలో రభస చోటు చేసుకోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తర్వాత మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితులు సద్దుమణగకపోవడంతో ఉభయ సభలు

జూలై ఒకటో తేదీకి వాయిదా పడ్డాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సభలో ప్రతిపాదించారు. ఈ తీర్మానపై జరిగే చర్చకు జూలై 2న ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌.. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు సుధాంశు త్రివేది తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై జరిగే చర్చకు జూలై మూడున ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌ నిండా అన్నీ అబద్ధాలే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 1975 నాటి ఎమర్జెన్సీనిని పదేపదే ప్రస్తావించడాన్ని ఖండించాయి. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తున్నదని మండిపడ్డాయి.

రాహుల్‌గాంధీ మైక్‌ కట్‌

నీట్‌ పరీక్షలో అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టిన సమయంలో రాహుల్ గాంధీ మైక్‌ మూగబోవడం అధికార, విపక్షాల మధ్య విమర్శలకు దారి తీసింది. తన మైక్‌ ఆఫ్‌ అయిపోయిందని, దానిని స్విచ్చాన్‌ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం వినిపించింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు సంఘీభావం చాటేందుకుగాను నీట్‌ అంశంపై గౌరవప్రదమైన చర్చ జరగాలని కోరారు. అయితే.. స్పీకర్‌ ఓంబిర్లా మాత్రం.. సభ నియమాలు, సంప్రదాయాలకు కట్టుబడాలని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తర్వాత నీట్‌ అవకతవకలపై చర్చ కోరాలని సూచించారు.

కానీ.. రాహుల్‌, ఇతర ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్‌పై పట్టుబట్టారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షం తరఫున భారతదేశ విద్యార్థులకు ఒక ఉమ్మడి సందేశం ఇవ్వాలని మేం కోరుతున్నాం. అందుకే ఈ అంశాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. విద్యార్థులను గౌరవించేందుకు నీట్‌ అంశంపై ఈ రోజే దీనికే పరిమితమై చర్చించాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు. తన మైక్‌ కట్‌ అయిందన్న ఆరోపణలపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. మైక్‌ను ఆఫ్‌ చేసేందుకు తన వద్ద ఎలాంటి బటన్లు లేవని బదులిచ్చారు. గతంలో ఉన్న వ్యవస్థే ఇప్పుడూ ఉన్నదని, మైక్‌లను కట్‌ చేసే వ్యవస్థ ఏదీ లేదని తెలిపారు.

రాహుల్‌ మైక్‌ కట్‌ అయిన వీడియోను కాంగ్రెస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రతిపక్షం, తమ భవిష్యత్తు అంధకారమైన లక్షల మంది విద్యార్థుల గొంతు నొక్కేందుకు కుట్ర జరుగుతున్నదని ఆందులో ఆరోపించింది. నీట్‌ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనాన్ని ఆశ్రయిస్తుంటే.. రాహుల్‌ గాంధీ పార్లమెంటులో యువత పక్షాన నిలిచారని పేర్కొన్నది. ‘ఇంతటి కీలకమైన అంశంలో పార్లమెంటులో మైకులు బంద్‌ చేయడం ద్వారా యువత గొంతును నొక్కేందుకు కుట్ర జరుగుతున్నది’ అని ఆరోపించింది.

Latest News