ఈనెల 29న ఉభయ సభలలో చర్చ
Operation Sindoor Debate | న్యూఢిల్లీ : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Attack) నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈనెల 29న పార్లమెంటు ఉభయ సభలలో ఆపరేషన్ సిందూర్ పై సుదీర్ఘ చర్చకు అంగీకరిస్తూ బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. మాల్దీవులు, యూకే పర్యటన ముగించుకొని జులై 26న స్వదేశానికి తిరిగొస్తున్నారు. దీంతో జులై 29న లోక్‌సభలో(Lok Sabha) జరిగే చర్చలో ప్రధాని పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. పాక్ లోని కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా భారత్ పైకి డ్రోన్లు, క్షిపణలతో దాడికి దిగింది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య యుద్దం మొదలైంది.
ఈ సమయంలో అకస్మాత్తుగా పాక్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ముగించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్నారు. దీంతో అగ్రరాజ్య ఆరోపణలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరపాలని..పీవోకే స్వాధీన ప్రయత్నం చేయకపోగా..ఆకస్మికంగా కాల్పుల విరమణ చేయడం..కశ్మీర్(Kashmir) పై భారత విధానానికి భిన్నంగా మూడో దేశం జోక్యం చేసుకున్నట్లుగా ట్రంప్ ప్రకటన ఉండటంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ఆయా అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు, పహల్గాం దాడి వెనక నిఘా వైఫల్యం వంటి ఆరోపణలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. విపక్షాల నిరసనలతో పార్లమెంట్(Parliament) కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఈనేపథ్యంలో దీనిపై చర్చకు కేంద్రం అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.