విధాత: ఎన్నికల కమిషన్ , బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని లోక్ సభలో విపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ లో ఓటర్ అధికార యాత్రలో ఆయన ఆదివారం నాడు అరారియాలో పర్యటించారు. కర్ణాటకలోని మహదేవ్ పూర్ అసెంబ్లీలో లక్ష మంది నకిలీ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని తాను లేవనెత్తిన ప్రశ్నలపై ఈసీ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.
కానీ, అవకతవకలపై తాను లేవనెత్తిన అంశాలపై ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. పైగా తననే అఫిడవిట్ సమర్పించాలని కోరుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన మాదిరిగానే అనురాగ్ ఠాకూర్ మాట్లాడితే ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ అనేది ఓట్లను దొంగిలించేందుకు ఈసీ సంస్థాగతంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈసీ సహాయంతో ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓట్లను దొంగిలించాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. దీన్ని బీహార్ లో ఇండియా కూటమి సాగనివ్వదని ఆయన అన్నారు.
సరైన ఓటర్ల జాబితాను అందించడమే ఈసీ విధి అని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలలో ఈసీ సక్రమంగా వ్యవహారించలేదని ఆయన అన్నారు. తన ప్రవర్తనను ఎన్నికల సంఘం మార్చుకునేలా చేసేవరకు తమ పోరాటం కొనసాగుతోందని ఆయన తెలిపారు.