విధాత: ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాధ్‌లో భారతదేశ మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ఆర్ ఆర్‌టీఎస్ కింద మొదటి ర్యాపిడ్‌ఎక్స్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని ఆర్ ఆర్ టీఎస్ RRTS కారిడార్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. ఇది సాహిబాబాద్ నుంచి ‘దుహై డిపో’ నుంచి 17 కిలోమీటర్ల దూరాన్ని ఘజియాబాద్, గుల్ధర్- దుహై వద్ద స్టేషన్లతో కలుపుతుంది. ఈ రైళ్ల సేవలు శనివారం నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
నమో భారత్ అని పేరు నామకరణం చేసిన రీజినల్ ర్యాపిడ్ రైలులో ప్రధాని మోదీ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, తోటి ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ఈ రైలు సేవలు ఎలా ఉన్నాయని, ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అడిగారు. శనివారం నుంచి సాధారణ ప్రజలకు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు మెట్రో తూర్పు పడమర కారిడార్, బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర, కెంగేరి నుంచి చల్లఘాట్ వరకు రెండు కారిడార్‌లను కూడా కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.