PM Modi | మూడోసారి ప్రధానిగా మోడీ.. పదేళ్ల తర్వాత కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం

వరుసగా రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్రమోడీ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి

  • Publish Date - June 9, 2024 / 12:05 AM IST

నేడు సాయంత్రం 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం
రాష్ట్రపతి భవన్‌ లో కార్యక్రమం
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న పొరుగు దేశాల అధినేతలు, ఏన్డీఏ పక్ష ముఖ్య నేతలు
భద్రతా బలగాల రక్షణలో రాష్ట్రపతి భవన్‌ ప్రాంతం
అతిథులు వచ్చే మార్గాల్లో స్నైపర్లు, పోలీస్‌ సిబంది పహారా

విధాత: వరుసగా రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్రమోడీ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనున్నది. దీంతో ఆ ప్రాంతాన్నంతా భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. మోడీ ప్రమాణస్వీకారానికి వివిధ దేశాల అధినేతలు వస్తుండటం, దేశంలోని ఎన్డీఏ పక్ష నేతలు హాజరుకానుండటంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు.

ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశ ప్రధానులు

ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు అధికారలు ఘన స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం. మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమాల్‌ దహల్‌ ప్రచండ, మారిషన్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.

ట్టుదిట్టమైన రక్షణ

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్‌ పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్‌ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో స్నైపర్లు, పోలీస్‌ సిబంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్‌ వంటి వాటి కోసం ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికను ఉపయోగిస్తున్నారు.

పదేళ్ల తర్వాత కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం

బీజేపీ 240 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో కలిపి 293 స్థానాలను కైవసం చేసుకున్నది. ఎన్డీఏ పక్షాలు తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమిలోని పార్టీలన్నీమోడీకి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రధాని సహా ఎన్డీఏ పక్ష నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి మద్దతు లేఖలు సమర్పించాయి. దీంతో రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటునకు ఎన్డీఏను ఆహ్వానించింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి ప్రాంతీయపార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. పదేళ్ల తర్వాత మళ్లీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువదీరనున్నది.

Latest News