- యాప్ పేరుతో ఇబ్బందులకు గురి
- స్మార్ట్ ఫోన్లు లేక రైతులు అవస్థలు
విధాత, హైదరాబాద్:
Urea Shortage | తెలంగాణలో గతేడాది వానాకాలంలో మొదలైన యూరియా కొరత సమస్య ఇప్పటికీ రైతాంగాన్ని వెంటాడుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొరత లేదని కాంగ్రెస్ పాలకులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో ఒక బస్తా దక్కించుకోవడం గగనంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు యాప్ ద్వారా విక్రయాలను ప్రారంభించినప్పటికీ సగటు రైతు ఒకటి రెండు బస్తాలను పొందడానికి కూడా అనేక యాతనలు పడుతున్నాడు. స్మార్ట్ ఫోన్ వాడకం తెలియని రైతులకు ఈ కొత్త విధానం చిరాకు, చికాకును తెచ్చి పెడుతున్నది. రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్లు లేని రైతులు 90 శాతం వరకు ఉన్నారని అంచనా. చాలా మంది సొసైటీల వద్దకు వెళ్లి ఉద్యోగులతో బుక్ చేసుకోవాల్సి వస్తుందటంతో సమయం ఎక్కువగా వృథా అవుతున్నదని లక్షలాది మంది ఆవేదన చెందుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు బస్తాలకు బస్తాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది రైతులు యూరియా కోసం నిద్రహారాలు మాని దుకాణాల ముందు, సొసైటీల కార్యాలయాల ముందు పడిగాపులు కాసిన విషయం ఇంకా మన మెదళ్ల నుంచి తొలగిపోలేదు.
- గత ఖరీఫ్ (వానకాలం) పంటలకు… ముఖ్యంగా వరి, మొక్క జొన్నలకు తీవ్ర కొరత ఎదురైంది.
- రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగినా.. అందుకు తగ్గట్టుగా దుకాణాలు, సొసైటీల్లో యూరియా సంచులు లభ్యం కాలేదు.
- రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తిలో బ్రేక్ డౌన్లు, వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కూడా తోడు కావడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
- గత వానకాలంలో సాగు విస్తీర్ణం 27 లక్షల ఎకరాలకు పైగా పెరగడంతో డిమాండ్ పెరిగిందని, అందుకే ఈ సమస్య తలెత్తిందని వ్యవసాయ శాఖ చెబుతోంది.
- కేంద్రం 8.3 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేసినప్పటికీ, ఆ ప్రకారంగా పంపిణీ చేయకపోవడంతో రైతాంగం రోడ్డు మీదికి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అప్పట్లో వాదించారు.
- అదనపు సరఫరా కోసం కేంద్రం పెద్దలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు ఎంపీలు పలుమార్లు కలిసినప్పటికీ ఆశించిన ప్రయోజనం లభించలేదు.
- ఆలస్యంగా సరఫరా చేయడం, ఈ లోపు పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడం మూలంగా దిగుబడి దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తమ ప్రభుత్వ హయాంలో యూరియా సమస్య లేదని, కొత్తగా ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ వాదించగా, యూరియా సరఫరాలో ఎక్కడా లోపం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అప్పట్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు 9.87 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని రాంచందర్ రావు వివరించారు. 10.43 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించిన తరువాత వానకాలం సీజన్ కోసం 2.04 లక్షల మెట్రిక్ టన్నులు మిగిలిందన్నారు. ఈ స్టాక్ ఎక్కడికి వెళ్లింది? ఏం చేశారనే దానిపై కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం ఆరు నెలల ముందే యూరియా కోసం ముందస్తు ప్రణాళిక అమలు చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని కేటీఆర్ అన్నారు.
వానకాలంలో సాధారణంగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తుండటంతో యూరియా అవసరం అధికంగా ఉంటుంది. గతేడాది వానకాలం సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగయ్యాయి. ఇందులో ఆహార ధాన్యాలు 76.14 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. సీజన్ ప్రారంభంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా కొరత మొదలై… ఆ తరువాత అన్ని జిల్లాల్లో ఇదొక సమస్య మారింది. ఒక గ్రామంలో రెండు వేల బస్తాల యూరియా అవసరం ఉండగా, 500 బస్తాలను మాత్రమే పంపించడంతో పోటీపడి కొట్లాడే దుస్ధితి కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిందని రైతులు మండిపడుతున్నారు.
- ఈ యాసంగి సీజన్‌లో కూడా రైతులు యూరియా బస్తాల కోసం మళ్లీ పరుగులు పెట్టే పరిస్థితి తీసుకువచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
- వారం రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చిలుకూరులో అన్నదాతలు రోడ్డెక్కారు.
- పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు.
- ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
- యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి ఉందని వాపోయారు.
- రోజుల తరబడి సొసైటీ ఆఫీసులు, ఫర్టిలైజర్ షాపుల ముందు క్యూ కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత సీజన్‌లో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. ఈ విషయంలో ప్రభుత్వం నిస్తేజంగా ఉండిపోయిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది రైతుల వద్ద పాత కీ ప్యాడ్ ఫోన్‌లే ఉన్నాయి. వీటితో యూరియా బస్తాలను ఎలా బుక్ చేసుకుంటామని రైతులు ప్రశ్నించారు. ఇలాంటి సాధారణ ఫోన్లను కలిగి ఉన్న తమకు యాప్ అంటే కూడా ఏంటో తెలియదని మహిళా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ బహిరంగ మార్కెట్‌లో బస్తాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉందని అంటున్నారు. యాప్ విధానంతో రైతాంగం ఇబ్బందులు పడుతోందని, స్మార్ట్ ఫోన్లు లేని వారి బాధ చెప్పనలవిగా ఉందని పలువురు రైతులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని యాప్ విధాన్ని రద్ధు చేయాలని, రైతులుకు నేరుగా సంచులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
నాలుగైదు రోజుల క్రితం నల్లగొండ జిల్లా పానగల్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) గోదాం ముందు సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయ లోపం కారణంగా రైతాంగం బలౌతోందని, సంచుల పంపిణీలో సరైన ప్రణాళికలు రూపొందించడంలో వ్యవసాయ శాఖ మంత్రి విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా యాప్ తో మేలు కన్నా కష్టాలే అధికంగా ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నందున వెంటనే యూరియా అందకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించేలా యుద్ధప్రాతిపదికన యూరియా నిల్వలు పెంచాలని, ప్రతి రైతు కోరిన విధంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
యాప్ లో బుక్ చేసుకుని వెళ్తే అప్పటికే నిల్వలు ఇతర రైతులకు పంపిణీ చేయడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గతంలో క్యూలో నిల్చుంటే ఒకటి రెండు బస్తాలు దక్కగా, ఇప్పుడు యాప్ లో యూరియా ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఉందని రైతులు ఆవేదన చెందున్నారు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1.85 లక్షల మంది రైతులు ఉండగా వీరిలో 70 శాతం మంది కీఫ్యాడ్ ఫోన్లనే వాడుతున్నారు. వీరంతా బుకింగ్ కోసం సొసైటీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. కొందరు తమ సంతానం లేదా తెలిసిన వారి స్మార్ట్ ఫోన్ల నుంచి బుక్ చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న వానాకాలం సీజన్ లో యూరియా వార్ మొదలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కళ్లు తెరవాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు ముందస్తుగా యూరియా నిల్వలు పెంచి, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం కోరుతోంది.
