Site icon vidhaatha

murder of a trainee doctor in Kolkata । కోల్‌కతా మెడికోపై సామూహిక లైంగిక దాడి!

ఇది ఒక్కడి పని కాదన్న డాక్టర్‌ సుబర్ణ గోస్వామి
90 డిగ్రీల కోణంలో విరిగిన మృతురాలి కాళ్లు
ఆమె కడుపుపై, పెదవులపై, వేళ్లపై గాయాలు
ఆత్మహత్య చేసుకుందని పిలిచిన అధికారులు
3 గంటలపాటు శవాన్ని చూడనీయలేదు
మృతదేహం దయనీయ స్థితిలో పడి ఉన్నది
మృతురాలి బంధువు వెల్లడి

murder of a trainee doctor in Kolkata । కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో దారుణ హత్యకు గురైన మెడికోపై (trainee doctor) సామూహిక లైంగిక దాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం (post-mortem) నివేదికలో ఆమె భౌతికకాయం నుంచి సేకరించిన ఫ్లూయిడ్స్‌ ఎక్కువ మొత్తంలో ఉండటాన్ని గమనిస్తే ఈ విషయం ధృవపడుతున్నదని ఒక వైద్యుడు చెప్పారు. ట్రైనీ డాక్టర్‌ శరీరంపై ఉన్న గాయాల స్వభావాన్ని (nature of injuries) గమనిస్తే ఇది ఒక్కడి పని అయి ఉండదని తెలుస్తున్నదని ఇండియా టుడేకు చెందిన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్‌ సుబర్ణ గోస్వామి చెప్పారు. ఆమె జననాంగం నుంచి సేకరించిన ద్రవం (vaginal swab) 151 గ్రాములు ఉన్నట్టు పోస్టుమార్టంలో పేర్కొన్నారని, ఒకే వ్యక్తి ద్వారా అంత పరిమాణంలో ద్రవం సాధ్యం కాదని తెలిపారు. దీన్ని గమనిస్తే ఒకరికంటే ఎక్కువ మంది (involvement of multiple people) ఈ నేరంలో పాల్గొని ఉంటారని ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి కూడా అయిన గోస్వామి అభిప్రాయపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఈ నేరంలో అనేక మంది పాత్ర ఉండి ఉండొచ్చని ఆరోపించిన విషయాన్ని గోస్వామి గుర్తు చేశారు. ఆమె గొంతు నులిమారని, జననాంగాన్ని ఛిద్రం చేశారని పోస్టుమార్టం నివేదిక పేర్కొన్నది. ‘కలిగిన గాయాలు, ఉపయోగించిన శక్తిని గమనిస్తే.. ఇది ఒక్కడి పని కాదు’ అని గోస్వామి తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబీకులకు చెప్పి..

తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తమకు చెప్పారని, మూడు గంటలపాటు తమను హాస్పిటల్‌లోనికి రానీయలేదని, ఆ తర్వాతే మృతదేహాన్ని చూసేందుకు అనుమతించారని మృతురాలి కుటుంబీకులు తెలిపారు. తమ కూతురి మరణవార్త చెప్పిన తర్వాత తాము నరకం అనుభవించామని వారు వెల్లడించారు. మృతురాలి సోదరితో, తల్లిదండ్రులు, బంధువులతో ఇండియా టుడే టీవీ చానల్‌ ప్రతినిధి మాట్లాడారు. హాస్పిటల్‌ నుంచి తనకు ఫోన్‌ రాగానే తన కుమార్తెకు ఏదో జరుగరానిది జరిగిందని భయపడ్డానని మృతురాలి తండ్రి చెప్పారు. తన భార్యను చూపిస్తూ ‘ఆమె ఏడవటం మొదలు పెట్టింది. వారు (హాస్పిటల్‌ వర్గాలు) మా కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, వెంటనే రావాలని చెప్పారు’ అని ఆయన తెలిపారు. ‘మమ్మల్ని కలుసుకునేందుకు మా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మాకు న్యాయం చేయాలని కోరాం. మా కుమార్తె ఇక తిరిగి రాదు. కనీసం ఆమెకు కనీసం న్యాయం (justice) జరగాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు.
ఈ ఘటన గురించి ఆర్‌జీకార్‌ హాస్పిటల్‌ ఛాతీ రోగాల విభాగం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కుటుంబీకులకు మొదట ఫోన్‌ చేసి తెలిపారని సమాచారం. కుమార్తె మరణంతో తల్లిని ఓదార్చడం తమ తరంకాలేదని తల్లిదండ్రులతోపాటు హాస్పిటల్‌కు వెళ్లిన బంధువు ఒకరు చెప్పారు. ‘ఆమె బిగ్గరగా ఏడవడం వినిపించింది. నేను వెంటనే వెళ్లాను. ఆమె నన్ను హత్తుకుని.. అంతా అయిపోయిందంటూ ఏడ్వసాగింది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపో యిందని హాస్పిటల్‌ వాళ్లు చెప్పారని తెలిపింది’ అని ఆమె పేర్కొన్నారు. తాము హాస్పిటల్‌కు వెంటనే చేరుకున్నా.. మూడు గంటలపాటు తమను బయటే నిలబెట్టేశారని బంధువులు తెలిపారు. ‘తమ కూతురు ముఖాన్ని చూపించమని హాస్పిటల్‌ అధికారులను తల్లిదండ్రులు కాళ్లావేళ్లాపడ్డారు. అయినా మూడు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది’ అని వారు చెప్పారు. ట్రైనీ డాక్టర్‌ పడి ఉన్న తీరు హృదయవిదారకంగా ఉన్నదని బంధువులు తెలిపారు. ‘మూడు గంటల తర్వాత తండ్రిని లోనికి అనుమతించారు. ఒక ఫొటో మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఆ ఫొటోను ఆయన బయటకు వచ్చిన తర్వాత మాకు చూపించారు. ఆమె ఒంటిపై దుస్తులు లేవు. ఆమె కాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉన్నాయి. కటి ఎముక విరిగితే తప్ప ఇలా సాధ్యం కాదు. ఆమెను కాళ్లు పట్టుకుని చీల్చపారేశారు’ అని బంధువు ఒకరు తెలిపారు. ‘ఆమె కండ్లజోడు పగిలిపోయింది. ముక్కలు ఆమె కళ్లలో గుచ్చుకున్నాయి. గొంతు నులిమి చంపేశారు. ఈ మాట నేను చెప్పడం లేదు.. అది పోస్టుమార్టంలో రుజువైంది’ అని ఆమె చెప్పారు.

పోస్టుమార్టం నివేదికలో ఏమున్నది?

ట్రైనీ డాక్టర్‌ మృతదేహానికి పోస్టుమార్టం (autopsy) నిర్వహించి, నాలుగు పేజీల నివేదిక ఇచ్చారు. అందులో ఆమెను గొంతు నులిమి (throttled) చంపినట్టు పేర్కొన్నారు. గొంతు నులమడంతో ఆమె థైరాయిడ్‌ మృదులాస్థి విరిగిపోయింది. ఆమె పొట్ట, పెదవులు, వేళ్లపై, ఎడమకాలిపై గాయాలు ఉన్నాయి. ఆమె రెండు కళ్లలో నుంచి, నోటి నుంచి, మర్మాంగం నుంచి రక్తస్రావమైనట్టు నివేదిక తెలిపింది. విశృంఖల లైంగిక దాడి కారణంగా ఆమె జననాంగానికి తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నది. ఆమె కంటిగాయం ఎలా అయిందన్న విషయంలో కారణాన్ని నివేదిక పేర్కొనలేదు.

Exit mobile version