Puja Khedkar : ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని (Provisional candidature) రద్దు చేసింది. అంతేగాక భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.
పుణెలో ట్రెయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేయడం, కారుపై ఎర్ర బుగ్గ లైటు, రాష్ట్ర ప్రభుత్వ నేమ్‌ప్లేట్ వాడటం వంటి చర్యలకు పాల్పడి వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విచారణ జరిపిన యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇచ్చింది. జూలై 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని యూపీఎస్‌సీ ఆదేశించింది. అయితే గడువు ఆగస్టు 4 వరకు పొడిగించాలని ఆమె కోరారు. యూపీఎస్‌సీ ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తూ.. జూలై 30 వరకు గడువు ఇచ్చింది. అయినా ఖేద్కర్ గడువులోగా సమాధానం ఇవ్వలేదు.
దాంతో యూపీఎస్సీ ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ.. భవిష్యత్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్టు ప్రకటించింది. నకిలీ పత్రాలతో పూజా ఖేద్కర్ పరీక్షలు క్లియర్ చేయడం, తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా లాంటి పత్రాలను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువసార్లు పరీక్షలు రాయడం చేసిందని యూపీఎస్‌సీ గుర్తించి చర్యలు చేపట్టింది.