Jammu and Kashmir । జమ్ముకశ్మీర్‌లో ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డంకులను తొలగించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా త్వరలోనే ఎన్సీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. ప్రమాణ స్వీకార వేడుక విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. చట్టం ప్రకారం.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సభ్యుల్లో పదో వంతకు మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 90 మంది సభ్యులు ఉన్నారు. మరో ఐదుగురిని ఎమ్మెల్యేలుగా గవర్నర్ నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా పది మందికి మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. 90 సీట్లకు గాను 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మెజార్టీ సాధించలేక పోయినా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలుపుకొని ఇండియా కూటమి తగినంత మెజార్టీతో ఉన్నది. కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్టు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందూ మెజార్టీ ప్రాంతమైన జమ్ముకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం కోసం రెండు మంత్రిపదవులు కేటాయిస్తారని తెలుస్తున్నది.
ఆదివారం (అక్టోబర్ 13, 2024) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్‌లో కేంద్ర పాలనను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఊపందుకున్నాయి. జమ్ముకశ్మీర్‌ను 2019 అక్టోబర్ 31న విభజించిన మూడు నెలలకు రాష్ట్రంలోని పీడీపీ, బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. 2019లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం తొలగించింది. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని అమల్లోకి తెచ్చింది. ఈ పరిణామంతో జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయింది. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రి కావాల్సిన ఒమర్ అబ్దుల్లాతోపాటు పలువురు కీలక నాయకులు, రాజకీయ కార్యకర్తలు, విద్యావేత్తలు, మేధావులను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజనకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం నిర్బంధకాండకు పునుకొన్నది.
ఇదిలా ఉంటే.. గండర్‌బల్, బుడ్గామ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఒమర్ అబ్దుల్లా అక్టోబర్ 11న శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిసి, ప్రభుత్వ ఏర్పాటకు అవకాశం కోరారు. తన పార్టీకి మద్దతుగా భాగస్వామ్య పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను ఆయనకు అందించారు. ఆ సమయంలో రాజ్‌భవన్ విడుదల చేసిన ఫొటో రాజకీయంగా ఆసక్తి రేపింది. ఆ ఫొటోలో గవర్నర్ సిన్హా, ఒమర్ అబ్దుల్లా ఇద్దరూ గంభీరవదనాలతో కనిపించారు. దీంతో రాబోయే రోజుల్లో గవర్నర్ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు కొనసాగే అంశంలో పలువురు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో గవర్నర్‌లకు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లో భావి రాజకీయ పరిస్థితులకు సంకేతమన్నట్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే గవర్నర్ తీసుకున్న నిర్ణయం నిలిచింది. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఐదుగురు సభ్యులను ఓటింగ్ హక్కులతో నియమించే అవకాశం ఉన్నది. అయితే.. ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రికి మాత్రమే ఆ ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉన్నదని నేషనల్ కాన్ఫరెన్స్ వాదిస్తున్నది. గవర్నర్ కార్యాలయం, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నాయని ఆరోపించింది. ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో కలుపుకొని మెజార్టీ మార్క్ 46 నుంచి 48కి చేరినప్పటికీ ఎన్సీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు ఒకరితోపాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఇండియా కూటమి బలంగా ఉన్నది.