- రాజకీయంగా కాదు.. భౌగోళికంగా
- ప్రధాన టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు
- తీవ్ర స్థాయి భూకంపాలకూ ఆస్కారం
- హెచ్చరిస్తున్న జియాలజిస్టులు
Tectonic Interactions | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారత రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతున్న నేపథ్యంలో భారతదేశం రెండుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు దక్షిణాది నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే భూభౌగోళిక శాస్త్రవేత్తలు మాత్రం ఆ విషయం ఎలా ఉన్నా.. ఇండియా భౌగోళికంగా రెండుగా చీలిపోవడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి. వాటి కదలికలు, పరస్పరం ఢీకొనడం వల్లే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ప్లేట్లు భారీ స్థాయిలో ఢీకొన్న సమయంలో ఉద్భవించినవే ప్రస్తుతం మనం చూస్తున్న పర్వతాలు. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ రెండుగా చీలిపోతున్నదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దీని పర్యవసానంగా భారతదేశం భౌతికంగా రెండు ముక్కలుగా చీలిపోనున్నది. ఈ సంచలనాత్మక అధ్యయనానికి సంబంధించిన వివరాలను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్‌లో పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనం డీలామినేషన్ (కణవిభాగం)ను సూచిస్తుంది. ఇక్కడ ప్లేట్ విడిపోయి.. భూమి కప్పులోకి మునిగిపోతుంది. ఇది దీర్ఘకాలంలో భూకంప ప్రమాదాలకు కారణమవుతుందని, ప్లేట్ టెక్టోనిక్స్ గురించి అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుందని ఆ అధ్యయనం పేర్కొంటున్నది.
సుమారు ఆరు కోట్ల సంవత్సరాల నుంచి యూరేసియన్ ప్లేట్‌ను ఇండియన్ ప్లేట్ స్లోమోషన్‌లో ఢీకొంటున్నది. దీని ఫలితంగానే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర సంగతి వెలుగు చూసింది. అది.. ఇండియన్ ప్లేట్‌లో కొంత భాగంగా డీలామినేషన్ అవుతున్నది. ఇందులో.. ప్లేట్‌లోని దట్టమైన దిగువభాగం విడిపోయి.. యూరేసియా ప్లేట్ కిందికి జారి, భూగర్భంలోకి మునిగిపోతుంది. టిబెటన్ స్ప్రింగ్స్‌లోని ఐసోటోప్స్ హీలియం, భూకంప తరంగాలను విశ్లేషించిన సమయంలో ఈ విషయాన్ని మొదటిసారిగా గుర్తించారు. దీని ప్రకారం ఇండియన్ ప్లేట్ నిట్టనిలువునా చీలిపోనున్నదనే అంచనాకు వచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం చాలా ప్రాథమికం, స్వల్పమేనని పూర్తిస్థాయి పర్యవసనాలు ఇంకా తెలియవని మొనాష్ యూనివర్సిటీలో జియోడైనమిసిస్ట్ ఫ్యాబియో క్యాప్టానియో చెప్పారు.
డీలామినేషన్ ప్రక్రియతో తీవ్ర పర్యవసానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో భూకంపాలకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. హిమాలయన్ కొల్లిజన్ జోన్ తరహాలో టెక్టోనిక్ ప్లేట్స్ అత్యధిక ఒత్తిడికి గురవుతున్నాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జియోఫిజిసిస్ట్ సైమన్ క్లెంపరర్ పేర్కొన్నారు. అందుకే తరచూ ఈ ప్రాంతంలో భూమి చీలినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఈ చీలికలు భూమిపై ఒత్తిడిని పెంచడంలో ప్రభావితం చేస్తాయని అన్నారు. ఫలితంగా భూకంపాల తీవ్రత పెరుగుతుందని వివరించారు. టిబెటన్ పీఠభూమి ప్రాంతం ఇప్పటికే సెస్మిక్ యాక్టివీటికి బాగా గురవుతున్న ప్రాంతం. ఇది ఇకపై మరింత అస్థిరతను పొందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్త పరిశోధన ఇండియన్ ప్టేట్ ఒక సెక్షన్‌లో డీలామినేషన్‌ను సూచిస్తున్నందున స్ట్రెస్ పాయింట్లు మార్పు చెంది.. శక్తిమంతమైన భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
Viral: రైలులో ఫుడ్ డెలివరీ.. షాకైన విదేశీయుడు! భారత్‌ను చూసి నేర్చుకోవాలని హితవు
Viral: రెండు కాళ్లు.. చేయి లేవు! కానీ డెలివరీ బాయ్‌గా విధి రాతను ఎదురించాడు