Site icon vidhaatha

rejuvenation of Sakarni । ఎండిపోయి, కనుమరుగైన నదికి మళ్లీ ప్రాణం పోశారు.. ఎక్కడంటే..

rejuvenation of Sakarni । దాదాపు 20 గ్రామాల్లోని 30వేల మందికి ఆ నదిలో పారే నీరే ఆధారం. కానీ.. కబ్జాల (encroachments) కోరల్లో కుంచించుకుపోయింది. ఒక దశాబ్ద కాలంలో అది నది అంటే నమ్మలేని స్థితిలో ఎండిపోయింది. కానీ.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల సంకల్పానికి (community effort) నదీమ తల్లి సైతం ప్రణమిల్లింది. మళ్లీ నిండుగా పారింది. దీని వెనుక ఆ 30 వేల మంది ప్రజల కష్టం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని 20 గ్రామాలకు చెందిన సుమారు 30 వేల మంది పది నెలలపాటు కష్టించి సకర్ణి నదిని పునర్జీవింపజేశారు. ఆ నది పారే ప్రాంతాల్లో కబ్జాలన్నిటినీ తొలగించి, నదిలో (seasonal river) పూడికను తవ్వి.. తమ ప్రాంతాలకు నీరు పారించుకున్నారు. సాయి నదికి ఉప నది సకర్ణి నది (Sakarni river). అంతిమంగా ఇది గంగా వ్యవస్థలో (Ganga system) భాగం. అయితే.. దాని స్వాభావిక ప్రవాహాన్ని ఇరువైపులా ఆక్రమణలు దారి మళ్లించేశాయి. మిగిలిన ప్రాంతంలో పూడిక పేరుకుపోయి.. నీళ్లుపారే అవకాశం లేకుడా పోయింది. ఇది దాని సమీప ప్రాంతాల్లో వ్యవసాయంపై పెను ప్రభావం చూపింది.

 

ఈ నేపథ్యంలో పర్యావరణ్‌ సేన  (Paryavaran Sena) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన స్థానిక పర్యావరణ కార్యకర్త అజయ్‌ క్రాంతికారి (Ajay Krantikari) చొరవ తీసుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఈ అంశాన్ని తొలుత జిల్లా మేజిస్ట్రేట్‌ నాయకత్వంలోని జిల్లా పర్యావరణ కమిటీ (district environment committee) దృష్టికి క్రాంతికారి తీసుకెళ్లారు. నదిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. క్రాంతికారి కృషితో సకర్ణి నది పునర్జీవనను 2023, అక్టోబర్‌ 13న చిన్న నదుల పునర్జీవన (rejuvenation) కార్యక్రమంలో చేర్చి, గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS) కింద చేపట్టారు. దీంతో పది నెలలపాటు ప్రజలంతా కష్టించి.. 27.7 కిలోమీటర్ల పొడవున నదిని పునర్జీవింపజేశారు.

 

నది అసలు మార్గాన్ని కనుగొనేందుకు పాత రెవెన్యూ రికార్డులను (Old revenue records) పరిశీలించారు. ఆ నది ఏయే ప్రాంతాల్లో ప్రవహించేదో స్థానికులు కూడా మర్చిపోయారంటే ఆక్రమణలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. దాని మార్గాన్ని గుర్తించిన అనంతరం చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన 30 వేల మంది నదిని పునరుద్ధరించే (restoration work) బృహత్కార్యంలో పాలుపంచుకున్నారు. దాదాపు పది నెలలపాటు కష్టపడ్డారు. అది వారికి నదిని పునరుద్ధరించుకోవడమే కాదు.. వారికి ఈ పది నెలలూ ఉపాధినీ అందించింది.

 

ఈ ప్రాజెక్టు కోసం జిల్లా యంత్రాంగం 1.35 కోట్లను వెచ్చించింది. స్థానిక ప్రజల తిరుగులేని సహకారంతో సకర్ణి నదిని పునరుద్ధరించుకోవడం సాధ్యమైందని జిల్లా డెవలప్‌మెంట్‌ అధికారి శ్రీకృష్ణ చెప్పారు. ఇప్పుడు నది సీజనల్‌ వర్షాలతో స్వాభావికంగా పారుతున్నది. సమగ్ర సర్వే, విశ్లేషణతో తాము నదీ మార్గంలో ఆక్రమణను గుర్తించగలిగామని ఆయన తెలిపారు. ఈ నదిని పునరుద్ధరించడంతో లక్ష్మణ్‌పూర్‌ (Laxmanpur), దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలకు తోడ్పాటు లభించినట్టయిందని అన్నారు.

Exit mobile version