Site icon vidhaatha

Samsung Workers strike । మూడోవారంలోకి శ్రీపెరంబదూర్‌ సాంసంగ్‌ కార్మికుల సమ్మె

Samsung Workers strike । వేతన సవరణ (wage revisions), వేతన పెంపు, మెరుగైన పని ప్రదేశం, కార్మిక యూనియన్‌కు గుర్తింపు (recognition of union) వంటి డిమాండ్లతో గత రెండు వారాలుగా తమిళనాడు శ్రీపెరంబదూర్‌లోని (Sriperumbudur) సాంసంగ్‌ ప్లాంట్‌ (Samsung plant) కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగాల్లోంచి ఊడబీకుతామని మేనేజ్‌మెంట్‌ బెదిరిస్తున్నా.. భద్రతాసిబ్బంది దాడులు చేస్తున్నా లెక్క చేయకుండా తమ ఐకమత్యాన్ని చాటుతున్నారు. ఈ సమ్మెకు సాంసంగ్‌ ఇండియా వర్కర్స్‌ యూనియన్‌  (SIWU) నాయకత్వం వహిస్తున్నది. దేశంలో సాంసంగ్‌ కంపెనీకి ఉన్న రెండు తయారీ యూనిట్లలో ఒకటి శ్రీపెరంబదూర్‌లో ఉన్నది. ఇక్కడ సుమారు 1800 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 1300కు పైగా సిబ్బంది సమ్మెలో ఉన్నారని సెంటర్ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌  (CITU) నేతలు చెబుతున్నారు. కార్మికుల డిమాండ్లకు కంపెనీ స్పందించకపోవడంతో వారు సమ్మె బాట పట్టారు. ఆగస్టులో ఇచ్చిన సమ్మె నోటీసుకు స్పందించడంలో మేనేజ్‌మెంట్‌ విఫలమైన నేపథ్యంలో కార్మికులు సెప్టెంబర్‌ 9న సమ్మెకు దిగారు.

2007లో యూనిట్‌ ప్రారంభం

శ్రీపెరంబదూర్‌ సమీపంలో సాంసంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 2007లో ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడ కార్మికులు, ఉద్యోగులకు యూనియన్‌ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్‌ పరికరాలను తయారు చేస్తుంటారు. తమ పట్ల మేనేజ్‌మెంట్‌ వివక్షతో, నిర్దాక్షిణ్యంతో వ్యవహరిస్తున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 9 గంటల పని విధానం (nine hour workday) ఇక్కడ అమల్లో ఉన్నది. దీనిని 8 గంటలకు తగ్గించాలని సమ్మెకు దిగిన SIWU డిమాండ్‌ చేస్తున్నది. ఒకే అర్హతలు ఉండి, ఒకే పని చేస్తున్నవారికి సమాన వేతనం (equalization of wages) ఇవ్వాలనే అంశంతోపాటు వివిధ రకాల అలవెన్సులు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు అర్హత ఉన్న సెలవులను ఉపయోగించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతాలతోపాటు కార్మికులు లేవనెత్తుతున్న ప్రధాన అంశాలను పరిష్కరించడంలో మేనేజ్‌మెంట్‌ విఫలమైందని దాదాపు 40 లక్షల మంది సభ్యులతో దేశంలోని ఒక ప్రధాన కార్మిక సంఘంగా ఉన్న CITU నేతలు చెబుతున్నారు.  కంపెనీ తన వార్షిక ఉత్పాదన విలువలో 0.3శాతం కంటే తక్కువ మొత్తాన్ని జీతాల వంటి కార్మిక ఖర్చులకు కంపెనీ వెచ్చిస్తున్నదని పేర్కొంటున్నారు.

 దశాబ్దం నుంచీ అరకొర జీతాలే

దశాబ్దకాలం నుంచీ పనిచేస్తున్నా ఇప్పటికీ ఉద్యోగులకు 30వేల రూపాయల లోపే జీతాలు ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీతాలు తమ జీవిత కనీసావసరాలకూ ఏమూలకూ సరిపోవడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంఘటితం కావాలని నిర్ణయించుకున్నారు. శ్రీపెరంబదూర్‌ యూనిట్‌లో కార్మికులు సాంసంగ్‌ ఇండియా వర్కర్స్‌ యూనియన్‌ పేరుతో 2023లో సంఘం పెట్టుకున్నారు. ఈ సంఘంలో 1400 మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఇప్పుడు సంఘం సభ్యత్వం 1700కు పెరిగిందని యూనియన్‌ అధ్యక్షుడు ఈ ముత్తుకుమార్‌ చెప్పారు. అయితే.. యూనియన్‌ పేరులో కంపెనీ పేరును వాడుకోవడంపై సాంసంగ్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంఘం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జాప్యం అవుతున్నది. ఇండియన్‌ యూనియన్‌ యాక్ట్‌ ప్రకారం 45 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తికావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ  కాలేదు. ఈ విషయంలో యూనియన్‌తో మాట్లాడేందుకు సైతం నిరాకరించిన మేనేజ్‌మెంట్..  సంఘం రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పైగా.. కొందరు కార్మికులతో విడిగా వర్కర్స్‌ కమిటీ (workers committee) పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేయించి, వారితో చర్చలు జరుపుతున్నదని SIWU నేతలు ఆరోపిస్తున్నారు. ఆ చర్చలకు ఎలాంటి చట్టబద్ధత (legal validity) లేదని తేల్చి చెబుతున్నారు.

 ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కంపెనీ యత్నాలు

తమ డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 16న జిల్లా కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళుతున్న దాదాపు వందమంది SIWU కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సమ్మె విరమించి అనేక మంది కార్మికులు విధుల్లో చేరారని మేనేజ్‌మెంట్‌ సోమవారం ప్రకటించింది. అయితే.. సమ్మె కారణంగా 80 శాతం ఉత్పాదకత నిలిచిపోయిందని సాంసంగ్‌ ఇండియా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు చెబుతున్నారు. బెదిరింపులకు కార్మికులు లొంగకపోవడంతో తాయిలాలకు సైతం మేనేజ్‌మెంట్‌ సిద్ధపడింది. కార్మికులకు బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని పనిలోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. అది కూడా విఫలమవడంతో గత వారం కార్మికులకు ‘నో వర్క్‌ నో పే’ నోటీసును జారీ చేసి బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే.. తమ సమ్మెను అక్రమమైనదని చెప్పేందుకు మేనేజ్‌మెంట్‌కు హక్కు లేదని కార్మికులు అంటున్నారు. తమ వేతనాలను నిలిపివేయడం చట్ట ప్రకారం చెల్లబోదని స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి జూలై నెలలో మేనేజ్‌మెంట్‌కు వినతిపత్రం సమర్పించామని, వాటికి స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారమే ఆగస్ట్‌లో సమ్మెకు నోటీసు ఇచ్చామని కార్మిక నేతలు చెబుతున్నారు. సాంసంగ్‌ కార్మికుల ఆందోళనలు వివిధ ఇతర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. చెన్నై నగరానికి సమీపంలో ఉండే శ్రీపెరంబదూర్‌ పారిశ్రామిక పట్టణం. సాంసంగ్‌ కంపెనీ వర్కర్లు చేస్తున్న ఆందోళనలు ఇతర కంపెనీలు, ఫ్యాక్టరీల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. వారికి సంఘీభావంగా (support) పలు కంపెనీల వర్కర్లు గేట్‌మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియాలోని నేషనల్‌ సాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ యూనియన్‌ (National Samsung Electronics Union (NSEU)) సైతం శ్రీపెరంబదూర్‌ యూనిట్‌ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో దక్షిణ కొరియాలో తొలిసారి (first ever strike) ఈ సంఘం సమ్మెకు వెళ్లింది. సంఘం పెట్టుకోవడం నేరం కాదని తమిళనాడు సీఐటీయూ అధ్యక్షుడు సుందర్‌ రాజన్‌ అన్నారు. కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళుతున్న కార్మికులను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. సాంసంగ్‌ కార్మిక సంఘం విషయంలో తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Exit mobile version