Shambhavi Chaudhary | పాట్నా : శాంభవి చౌదరి.. ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఎందుకంటే 25 ఏండ్ల వయసులోనే ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలు కూడా శాంభవినే. దళిత కమ్యూనిటీ నుంచి ఈ వయసులో ఎన్నికైంది కూడా శాంభవినే.
బీహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) తరపున శాంభవి చౌదరి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై 1,87,251 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శాంభవికి 5,79,786 ఓట్లు పోలవ్వగా, సన్నీ హజారీకి 3,92,535 ఓట్లు పోలయ్యాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న అశోక్ కుమార్ చౌదరి కూతురే శాంభవి చౌదరి. ఈమె తాత మహవీర్ చౌదరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన బీహార్ మంత్రిగా పని చేశారు.
ఈ సందర్భంగా శాంభవి మాట్లాడుతూ.. తనను ఆదరించి, భారీ మెజార్టీతో గెలిపించిన సమస్తిపూర్ ప్రజలకు రుణపడి ఉంటాను. వారందరికి శిరసు వంచి నమస్కరిస్తున్నారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ నేల సమస్తిపూర్ నుంచి తాను గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి కోసం కష్టపడి పని చేస్తానని శాంభవి పేర్కొన్నారు.