Mushroom Cultivation | బీహార్( Bihar )లోని సర్నాకు చెందిన అజయ్( Ajay ) 2002లో ఎంఏ పొలిటికల్ సైన్స్( Political Science ) చదివాడు. కానీ ఉద్యోగ అవకాశాలు పెద్దగా లభించలేదు. దీంతో తన కుటుంబం చేసే ఇటుక బిజినెస్‌లో చేరి.. ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టాడు. 2005 నుంచి 2009 వరకు ఎన్జీవో( NGO ) సంస్థలో చేరి శానిటేషన్ ప్రాజెక్టులపై వర్క్ చేశాడు. ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేశాడు. కానీ ఆయన జీవితాన్ని ఓ దినపత్రిలో వచ్చిన కథనం పూర్తిగా మార్చేసింది.
ఆ కథనం ఏంటంటే..?
2018లో స్థానికంగా ప్రచురితమయ్యే ఓ దినపత్రికలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ దయారాం పుట్టగొడుగుల సాగుపై ప్రత్యేక కథనం రాశాడు. ఆ కథనాన్ని చదివిన అజయ్ యాదవ్.. చాలా ప్రేరణ పొందాడు. తక్షణమే డాక్టర్ దయారాంను కాల్ చేసి కలుస్తానని అజయ్ చెప్పాడు. అందుకు దయారాం కూడా అంగీకరించాడు.
పొలిటికల్ సైన్స్ నుంచి పుట్టగొడుగుల సాగు వైపు..
2019లో సరన్ జిల్లాలోని ఓ మూడు గదుల్లో పుట్టగొడుగుల సాగును ప్రారంభించాడు అజయ్. ఆ మూడు గదుల నుంచి ఇవాళ 6 వేల చదరపు అడుగుల్లో తన పుట్ట గొడుగుల సాగును విస్తరించాడు. ఈ సాగు ద్వారా నెలకు రూ. 25 లక్షల చొప్పున ఏడాదికి రూ. 3 కోట్లు సంపాదిస్తున్నాడు అజయ్. అంటే నెలకు 180 టన్నుల దిగుబడి వస్తుంది.
సాగుకు ఏసీ గదులు..
ఈ సాగుకు మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నాడు. అన్ని గదుల్లోనూ ఏసీ ఉండేలా ప్లాన్ చేశాడు. ఒక్కో గదిలో 2,800 మష్రూమ్ బ్యాగులను సాగు చేసేలా ప్రణాళికలు రచించాడు. తేమ, ఉష్ణోగ్రత తగిలేలా ఏర్పాట్లు చేశాడు.
శిక్షణతో 30 టన్నుల వరకు దిగుబడి..
వీటన్నింటి కంటే ముందు.. అజయ్ సమస్టిపూర్‌లో పుట్టగొడుగుల సాగుపై శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక అక్కడ్నుంచి ఢిల్లీలో కేజీ 110 వెచ్చించి మష్రూమ్ స్పాన్స్‌ను కొనుగోలు చేశాడు. 300 కేజీల స్పాన్స్‌ను 3 వేల బ్యాగుల్లో సాగు చేశాడు. 2019 అక్టోబర్ తొలి పంట చేతికి వచ్చింది. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి గది నుంచి కూడా 5 టన్నుల దిగుబడి వచ్చింది. రెండు దశల్లోనే మొత్తం 30 టన్నుల వరకు దిగుబడి సాధించగలిగాడు అజయ్. తొలి పంటను పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు నేపాల్‌లో విక్రయించాడు. కరోనా సమయంలో కొంత నష్టాలు చవి చూడాల్సి వచ్చింది.
రూ. ఖర్చులు పోనూ 60 లక్షల వరకు లాభం..
కరోనా అనంతరం మళ్లీ లాభాల బాట పట్టాడు అజయ్. ఇప్పుడు మూడు గదుల నుంచి 6 గదుల వరకు పుట్టగొడుగుల సాగును విస్తరించాడు. నెలకు 15 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నాడు. ఏడాదికి ఆరు దశల్లో పుట్టగొడుగులు చేతికి వస్తున్నాయి. మొత్తంగా 180 టన్నులకు చేరుకున్నాడు. ఒక్కో కేజీ పుట్టగొడుగులను రూ. 160కి విక్రయిస్తున్నాడు. ఎండాకాలంలో అయితే ఈ ధర రూ. 220కి చేరుకుంటుంది. అలా ఏడాదికి రూ. 3 కోట్లు సంపాదిస్తున్నాడు అజయ్. ఇందులో ఖర్చులు పోనూ రూ. 60 లక్షల వరకు లాభం ఉంది.
