Mushroom Business | బీహార్( Bihar )లోని లఖిసరాయి( Lakhisarai ) గ్రామానికి చెందిన అమిత్ కుమార్( Amit Kumar ), దీపిక( Deepika ) దంపతులిద్దరూ కరోనాకు ముందు మహారాష్ట్రలోని పుణె( Pune )లో ఉద్యోగాలు చేసేవారు. అమిత్ కుమార్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ కాగా, ఐటీ సెక్టార్‌లో ఉద్యోగం చేసేవాడు. దీపిక డిగ్రీ పూర్తి చేసింది. బేకర్‌గా కూడా శిక్షణ పొందింది. ఇక కరోనా( Corona ) కారణంగా వారిద్దరూ తమ ఉద్యోగాలను కోల్పోయారు. దాంతో తమ సొంతూరు లఖిసరాయికి తిరిగొచ్చారు.
యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండగా..
2020లో లాక్‌డౌన్ సమయంలో.. కొత్తగా ఏం చేయగలం అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఖాళీ సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండగా.. పుట్టగొడుగుల సాగు కంట పడింది. అదేదో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉందని భావించారు. మరింత దృష్టి సారించి పుట్టగొడుగుల సాగు మీద.
అనుకున్నంత దిగుబడి రాలేదు.. అయినా వెనుకడుగు వేయలేదు
ఇక సొంతింట్లోని ఓ గదిలో 2020 సెప్టెంబర్‌లో పుట్టగొడుగుల సాగును ప్రారంభించారు అమిత్, దీపిక. మొదట 7 కేజీల వరకు ఆయిస్టర్ మష్రూమ్స్ స్పాన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. వాటిని 50 బ్యాగుల్లో ప్లాంటేషన్ చేశారు. 25 రోజుల్లో పుట్టగొడుగులు చేతికొచ్చాయి. కానీ అనుకున్నంత దిగుబడి రాలేదు. కేవలం 20 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. కాస్త నిరుత్సాహం ఉన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు అమిత్.
నెలకు పైగా శిక్షణ.. పుట్టగొడుగుల సాగులో మెళకువలు
పుట్టగొడుగుల సాగులో మెళకువలు నేర్చుకునేందుకు అమిత్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్థానికంగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాడు. 30 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. సోలన్‌లోని ఐకార్ అనుబంధ సంస్థ మష్రూమ్ రీసెర్చ్ డైరెక్టరేట్ ద్వారా ఏడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణ ముగిసిన అనంతరం వరి గడ్డి, వెదురు కర్రలతో రెండు గుడిసెలను నిర్మించాడు. దాంట్లో పుట్టగొడుగుల సాగును ప్రారంభించాడు.
మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న వ్యాపారం..
ఈ సారి 6 వేల బ్యాగుల్లో పుట్టగొడుగుల సాగును ప్రారంభించాడు. వెస్ట్ బెంగాల్ నుంచి 350 కేజీల మష్రూమ్ స్పాన్స్‌ను కేజీ రూ. 96 చొప్పున కొనుగోలు చేశాడు. ఈ సాగు ద్వారా 5 వేల కేజీల దిగుబడి వచ్చింది. ఇక అప్పట్నుంచి ఆ దంపతుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉంది. తాజా పుట్టగొడుగులను కేజీ రూ. 150 చొప్పున విక్రయిస్తున్నాడు. ఎండిన పుట్టగొడుగులను కేజీకి రూ. 500 రూ. 600 వరకు చొప్పున విక్రయిస్తున్నాడు.
ఏడాదికి రూ. 24 లక్షలు సంపాదన..
దీపిక ఇప్పటికే బేకరీ ఉత్పత్తుల విషయంలో శిక్షణ తీసుకుంది కాబట్టి.. ఆమె బేకరీ ప్రారంభించింది. పుట్టగొడుగులకు సంబంధించి పలు వెరైటీలను తయారు చేస్తూ విక్రయిస్తుంది. పుట్టగొడుగులతో కేక్స్, బిస్కెట్లు, బ్రెడ్స్, బన్స్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. మష్రూమ్స్ పికెల్స్ కూడా తయారు చేస్తుండడంతో వాటికి కూడా డిమాండ్ ఉంది. ఈ ఉత్పత్తులన్నింటినీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణెతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులకు తమకున్న పరిచయాల ద్వారా విక్రయిస్తున్నారు. అలా ఏడాదికి రూ. 24 లక్షలు సంపాదిస్తున్నారు ఈ దంపతులు.
READ ALSO |
Ambali cart Business Idea | అంబలి కార్ట్‌తో లక్షల ఆదాయం… మన్జు జీవితాన్ని మార్చిన అమ్మ మాట
Millet Food Business | ఆమె చదివింది పదో తరగతే.. సంపాదన మాత్రం రూ. 70 లక్షలు..!
AI Job Disruption | ఏఐ ఎఫెక్ట్.. ముందువరుసలో జర్నలిస్టులు, అనువాదకులు, రచయితలు! ఎఫెక్ట్‌లేని టాప్ టెన్ ఉద్యోగాలేంటి?
