AI Job Disruption | ఏఐ సాంకేతిక విప్లవం ఊహించని వేగంతో దూసుకుపోతున్నది. ఆ వేగంలో అనేక ఉద్యోగాలు కొట్టుకుపోతున్నాయి. దాని ప్రభావం ఏయే రంగలపై ఎంత మేరకు ఉండబోతున్నదనే విషయంలో మైక్రోసాఫ్ట్ గత జూలై నెలలో ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో అనేక విస్తుబోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మొదటగా ప్రభావితమయ్యేది రచయితలు, చరిత్రకారులు, అనువాదకులు, జర్నలిస్టులు వంటి వృత్తుల్లోని వారేనని ఆ అధ్యయనం నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఏఐ టూల్స్ విస్తృత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. అందులోనూ కస్టమర్ సర్వీసెస్ ప్రతినిధులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌తోపాటు.. భాష ఆధారిత, రచన, సమాచార విశ్లేషణ వృత్తులు తీవ్రంగా ప్రభావానికి గురికానున్నాయని అధ్యయనం అంచనా వేసింది. ఈ రంగాల్లో అమెరికాలో సుమారు 50 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ అధ్యయనం అమెరికాలోని వర్క్‌ఫోర్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు ఉద్దేశించినప్పటికీ.. దాదాపుగా యావత్ ప్రపంచంలో అదే తరహా ప్రభావాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాలెడ్జ్ బేస్డ్ పనులకు ముప్పు
ఏఐ ఎక్కువగా ఉపయోగపడే వృత్తులన్నీ నాలెడ్జ్ బేస్డ్ పనులని అధ్యయనం తెలిపింది. అవి ముఖ్యంగా రచనలు, సమాచార వివరణ, మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ వంటి రంగాలుగా పరిశోధకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం తదితర కంపెనీలు రానున్న ఐదేళ్లలో వేల కొద్దీ కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్స్ నిలిపేస్తున్నాయి. ఆ స్థానాలను ఐఏతో భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కొలువులు దొరకడం కష్టంగా మారుతున్నదని Indeed నివేదిక పేర్కొంటున్నది. ఏఐ ప్రభావం తక్కువగా ఉండే వృత్తులు కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా మానవ శారీరక శ్రమ, వివిధ పరికరాలతో సంబంధం ఉన్న ప్రొఫెషన్స్‌పై ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొంటున్నది. వీటిలో డ్రెడ్జ్ ఆపరేటర్లు, బ్రిడ్జ్, లాక్ టెండర్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఆపరేటర్లు, రైల్వే మెయింటనెన్స్ వర్కర్లు, ఫౌండ్రీ మౌల్డ్ మేకర్స్ తదితరులు చేసే పనులన్నీ పూర్తిగా సాంకేతిక పరికరాలు, పనిముట్ల ఆధారంగానే ఉంటాయి. కాబట్టి వీటిని ఏఐతో భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ప్రతి ఉద్యోగం ఏదో ఒక విధంగా ఏఐ ప్రభావానికి గురవుతుందని ఎన్విడియా సీఈవో జాన్సన్ హువాంగ్ అన్నారు. ఏఐని ఉపయోగించడానికి కూడా ఒక వ్యక్తి అవసరమన్న హువాంగ్.. ఏఐతో ఉద్యోగం కోల్పోరని, దానిని ఉపయోగించే వ్యక్తి కారణంగా కోల్పోతారని మే నెలలో మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వివరించారు.
డిగ్రీ ఉన్నా రక్షణ లేదు
బాచ్‌లర్ డిగ్రీ విద్యార్హత సరిపోయే ఉద్యోగాలే ఎక్కువగా ఏఐ ప్రభావానికి గురవుతాయని మైక్రోసాఫ్ట్ పరిశోధకులు పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, మేనేజ్‌మెంట్ అనలిస్టుల వంటి ఉద్యోగాలకు డిగ్రీ అర్హతలు అవసరమైనప్పటికీ.. ఏఐ కారణంగా ఇవి ఎక్కువ మార్పులకు లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు లక్షలకు పైగా కోపైలట్ యూజర్ సంభాషణలను విశ్లేషించి.. ఏ వృత్తులు ఎక్కువగా ఏఐ ప్రభావానికి గురవుతాయో తాము గుర్తించినట్టు పరిశోధకులు కిరణ్ టామ్లిన్‌సన్ తెలిపారు.
హెల్త్‌కేర్, హోమ్ హెల్త్ సపోర్టు రంగాలకు ముప్పు లేదు
ఆరోగ్య రక్షణ, హోమ్ హెల్త్ సపోర్ట్ వంటి రంగాలపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పైగా.. రాబోయే పదేళ్ల కాలంలో ఇటువంటి సేవలు పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
విద్యారంగంపైనా ప్రభావం
టెక్ ఉద్యోగాల్లో భారీ స్థాయిలో లేఆఫ్‌లను గమనిస్తున్న ప్రస్తుత జెన్ జీ బోధనను ఇబ్బందిలేని కెరీర్‌గా భావిస్తున్నప్పటికీ.. అక్కడ కూడా ఏఐ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. పొలిటికల్ ఎకనమిక్స్, లైబ్రరీ సైన్స్, ఫామ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేటర్స్ వంటి ఉపాధ్యాయ వృత్తుల వారు కూడా ఏఐ ఎఫెక్ట్‌కు గురయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. పాఠాలు బోధించే ఉపాధ్యాయులను ఏఐ పూర్తిగా భర్తీ చేయలేక పోయినా.. బోధనా విధానాలను మార్పుచేయగల శక్తి ఏఐకి ఉందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొంటున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో ఉద్యోగ ప్రపంచంలో రాత్రికి రాత్రే అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఉద్యోగాలు మాయం అవుతాయి అనేది అనివార్యం. అదే సమయంలో కొన్ని ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయి. అయితే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐకి భయపడేవారు వెనుబడిపోతారని, ఏఐని ఉపయోగించగల శక్తియుక్తులు కలిగినవారు ముందుకు వెళతారని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
అత్యధికంగా ప్రభావితమయ్యే టాప్ టెన్
- అనువాదకులు, ఇంటర్పెటర్స్
- చరిత్రకారులు
- రచయితలు
- కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
- సేల్స్ రిప్రజెంటేటివ్స్
- జర్నలిస్టులు
- ఎడిటర్లు, ప్రూఫ్రీడర్లు
- టెలిమార్కెటర్స్
- బిజినెస్ టీచర్లు
- పబ్లిక్ రిలేషన్స్ నిపుణులు
ప్రభావం తక్కువగా ఉండే టాప్ టెన్
- డ్రెడ్జ్ ఆపరేటర్లు
- బ్రిడ్జ్ అండ్ లాక్ టెండర్లు
- వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు
- ఫౌండ్రీ మోల్డ్ మేకర్లు
- రైల్ ట్రాక్ మెయింటెనెన్స్ వర్కర్స్
- ఫ్లోర్ సాండర్స్
- మోటర్‌బోట్ ఆపరేటర్లు
- లాగింగ్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు
- ఆర్డర్లీస్
- పైల్ డ్రైవర్ ఆపరేటర్లు
Read Also |
Gen Z AI Tools | జెన్ జెడ్ (Gen Z) AI వాడకంలో ముందున్నదీ వారే.. నష్టపోతున్నదీ వారే!
AI వీగన్లు: కృత్రిమ మేధస్సుకు దూరంగా కొత్త జీవనశైలి
Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!
