IBM| ఆఫీస్‌కు ద‌గ్గ‌ర్లో ఇల్లు తీసుకోండి.. లేదంటే ఉద్యోగం మానేయండి

IBM ఉద్యోగుల‌కు ఆల్టిమేటం జారీ చేసింది. ఇప్ప‌టికీ రిమోట్ ప్రాంతాల్లో ప‌ని చేస్తున్నారో వారు వెంట‌నే సంస్థ ఉన్న ప్రాంతంలో ఇల్లు తీసుకోవాల‌ని

  • Publish Date - January 30, 2024 / 10:24 AM IST

ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ సంస్థ ఐబీఎం (IBM) ఉద్యోగుల‌కు ఒక ఆల్టిమేటం జారీ చేసింది. ఇప్ప‌టికీ రిమోట్ ప్రాంతాల్లో (కంపెనీ ఉన్న చోటుకు దూరంగా) ప‌ని చేస్తున్నారో వారు వెంట‌నే సంస్థ ఉన్న ప్రాంతంలో ఇల్లు తీసుకోవాల‌ని.. లేదంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోవాల‌ని క‌ఠినంగా హెచ్చ‌రించింది. అమెరికాలో ఉన్న ఐబీఎం మేనేజ‌ర్లంద‌రికీ ఈ ఆల్టిమేటం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. వారంలో కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి హెచ్ ఆర్ మేనేజ‌ర్‌కు రిపోర్టు చేయాల‌ని సూచించింది. ‘క్ర‌మం త‌ప్ప‌కుండా మేము చెప్పే సూచ‌న‌ను పాటించండి. మేము మేనేజ‌ర్లు వారంలో క‌నీసం మూడు రోజులు ఆఫీస్‌కు నేరుగా రావాల‌ని కోరుకుంటున్నాం.

అలా చేస్తార‌ని ఆశిస్తున్నాం’ అని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఐబీఎం నేతృత్వం వ‌హిస్తున్న సీఈఓ అర‌వింద్ కృష్ణ‌.. వ‌ర్క్ ఫ్రం హోం విధానానికి కాస్త విముఖంగా ఉంటారు. ఉద్యోగి సంస్థ‌కు వ‌చ్చి ప‌ని చేస్తేనే ప‌ని స‌మ‌ర్థ‌వంతంగా చేస్తార‌ని ఆయ‌న న‌మ్ముతారు. అందుకు అనుగుణంగానే తాజా ఆల్టిమేటం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త‌మ కంపెనీలో ఇంటి నుంచి ప‌ని చేసేవారికి, ఆఫీస్‌కు ఎక్కువ‌గా రాకుండా ఎక్క‌డి నుంచో ప‌ని చేసేవారికి ప్ర‌మోష‌న్లు రావ‌డం చాలా అరుద‌ని ..బ్లూమ్‌బ‌ర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న వెల్ల‌డించారు. ఈ సంస్థ‌లోని కొన్ని విభాగాలు అటెండెన్స్ రిజిస్ట‌ర్‌లను ఉప‌యోగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఉద్యోగులు మూడు రోజులు వ‌స్తే చాల‌ని… మేనేజ‌ర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మాత్రం వారానికి మరికొన్ని రోజులు ఎక్కువ‌గా వ‌స్తే మంచిద‌ని హెచ్ ఆర్ మేనేజ‌ర్లు సూచిస్తున్నారు. అయితే ఎన్ని నిబంధ‌న‌లు పెట్టినా 2023లో ఉద్యోగుల హాజ‌రు.. కొవిడ్ ముందు స్థాయికి చేరుకోక‌పోవ‌డం విశేషం.

అమెరికాలోని ప్ర‌ధానమైన 10 న‌గ‌రాల్లోని ఆఫీసుల్లో 50 శాతం త‌క్కువ‌గానే హాజ‌రు న‌మోదైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసినా ఐబీఎం అన్ని శాఖ‌ల్లోనూ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గానే ఉంది. ఐబీఎం కార్య‌క‌లాపాల‌ను గ‌మ‌నిస్తే న‌ష్టాల భ‌యంతో ఇత‌ర విభాగాల‌కు క్ర‌మంగా దూరంగా జ‌రిగిన ఐబీఎం.. సాఫ్ట్‌వేర్‌, స‌ర్వీసుల రంగాల‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అయింది. వాతావ‌ర‌ణం, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ‌ను అభివృద్ధి చేయ‌డానికి భారీగా నిధుల‌ను వెచ్చిస్తోంది.