Ajit Pawar Tweet Viral  | మహిళా పైలట్‌ గురించి అజిత్‌ పవార్‌ ట్వీట్‌ వైరల్‌.. అందులో ఏముందంటే..?

రెండేండ్ల క్రితం అజిత్‌ పవార్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ ట్వీట్‌లో అజిత్‌ పవార్‌.. ‘మనం హెలికాప్టర్‌ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు.. విమానం లేదా హెలికాప్టర్‌ స్మూత్‌గా ల్యాండ్‌ అయితే, పైలట్‌గా ఉన్నది ఓ మహిళ అని మనం అర్థం చేసుకోవాలి’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Ajit Pawar Tweet Viral  | మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌తోపాటూ మరో నలుగురు కూడా మరణించారు. అందులో ఓ మహిళా పైలట్‌ (pilot) శాంభవీ పాఠక్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండేండ్ల క్రితం అజిత్‌ పవార్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ ట్వీట్‌లో అజిత్‌ పవార్‌.. ‘మనం హెలికాప్టర్‌ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు.. విమానం లేదా హెలికాప్టర్‌ స్మూత్‌గా ల్యాండ్‌ అయితే, పైలట్‌గా ఉన్నది ఓ మహిళ అని మనం అర్థం చేసుకోవాలి’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

మృతుల్లో యువ మహిళా పైలట్‌ శాంభవి పాఠక్‌..

మరోవైపు విమాన ప్రమాదంలో యువ మహిళా పైలట్‌ కెప్టెన్‌ శాంభవి పాఠక్‌ కూడా ఉండటంతో ఆమె వివరాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. బుధవారం అజిత్‌ పవార్‌ ప్రయాణించిన లియర్‌జెట్‌-45 విమానంలో పైలట్‌ ఇన్‌ కమాండ్‌గా కెప్టెన్‌ సుమిత్ కపూర్‌ వ్యవహరించగా.. శాంభవి పాఠక్ ఫస్ట్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. కెప్టెన్‌ సుమిత్‌కు 16,500 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం రెండుసార్లు ప్రయత్నించగా.. చివరకు విమానం ఓ బండరాయికి గుద్దుకుని మంటలు చెలరేగి ముక్కలుగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 5 మంది అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకురాలు పింకీ మాలి, సెక్యూరిటీ ఆఫీసర్ విదిప్ జాదవ్, ఇద్దరు పైలట్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

ఎవరీ శంభావి పాఠక్..?

శాంభవి పాఠక్‌ ఎయిర్‌ఫోర్స్‌ బాలభారతి స్కూల్‌లో చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ విద్యను పూర్తిచేసుకున్న శాంభవి ముంబయి యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్‌, ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ పొందారు. చిన్న వయసులోనే కమర్షియల్‌ విమానాలు నడిపే లైసెన్స్‌ పొందిన ఆమె.. న్యూజిలాండ్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ పైలట్‌ అకాడమీలో కమర్షియల్‌ పైలట్‌ శిక్షణ తీసుకుని లైసెన్స్‌ పొందారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్‌ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రోజెన్‌ ఎయిర్‌లైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా పొందారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్‌ ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేశారు. 2022 ఆగస్టు నుంచి వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో ఫుల్‌ టైమ్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్‌ ప్రముఖులు ప్రయాణించే లియర్‌జెట్‌-45 లాంటి విమానాలను నడుపుతున్నారు. ప్రమాదంలో కూలిన అజిత్ పవార్ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా కొనసాగుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది.

అజిత్‌ పవార్‌ దుర్మరణం..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pawar) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి (Baramati)లో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో అదుపుతప్పి కుప్పకూలిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తోపాటూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు అజిత్‌ పవార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Latest News