Renuka Swamy case | శాఖాహారి నోట్లో కావాలనే బిర్యానీ కుక్కారు.. ఒక్కొక్కటిగా బయటికొస్తున్న దర్శన్‌ గ్యాంగ్‌ లీలలు..!

Renuka Swamy case | రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ గ్యాంగ్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్‌, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతోపాటు 14 మందికి 5 రోజులపాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది. కేసులో ఇప్పటివరకు మొత్తం 19 మందిని అరెస్ట్‌ చేశారు.

  • Publish Date - June 17, 2024 / 09:30 AM IST

Renuka Swamy case : రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ గ్యాంగ్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్‌, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతోపాటు 14 మందికి 5 రోజులపాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది. కేసులో ఇప్పటివరకు మొత్తం 19 మందిని అరెస్ట్‌ చేశారు. వారి కస్టడీ ముగిశాక పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దర్శన్‌, పవిత్రగౌడ, పవన్‌, రాఘవేంద్ర, నందీశ్‌, జగదీశ్‌, అనుకుమార్‌, వినయ్‌, నాగరాజ్‌, లక్ష్మణ, దిలీప్‌, ప్రదోశ్‌ , కేశవమూర్తిలను మరింత విచారించాల్సి ఉందని, కాబట్టి కస్టడీకి ఇవ్వాలని కోరారు.

దాంతో కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. కాగా కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ప్రసన్న కుమార్‌ను సర్కారు నియమించింది. ఇదిలావుంటే రేణుకాస్వామి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో దర్శన్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాస్వామిని ఉంచిన షెడ్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు.

‘రేణుకాస్వామి హత్య గురించి నాకేం తెలియదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్‌ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్‌ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దాంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్‌ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్‌ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నా. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దాంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పాను. నేడు షెడ్‌ నుంచి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్యచేశారు. ఇంతకు మించి నాకేం తెలియదు’ అని దర్శన్‌ చెప్పాడు.

అయితే షెడ్‌ వద్దకు దర్శన్‌, పవిత్ర కార్లు రావడం.. శవాన్ని పడేసిన చోట కూడా వారి కార్లు తిరగడం సీసీ కెమెరాల్లో కనిపించింది. దాంతో ఈ కేసు ఇద్దరికీ క్లిష్టంగా మారింది. అయితే పోలీసులు విచారణలో దర్శన్‌ బాస్‌ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్‌లో బంధించి హింసించిన నిందితులు చికెన్‌ బిర్యానీ తెప్పించి, మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత్‌ కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి అని తెలిసి కూడా కావాలనే చనిపోయే ముందు అతని నోట్లో బిర్యానీ కుక్కారు. ‘బాస్‌ వస్తారు. ముక్కలు తిని రెడీగా ఉండు. తన్నులు తినడానికి బలం కావాలి కదా..’ అంటూ ముఠా సభ్యులు హేళన చేశారు. ఈ విషయాన్ని నిందితుల్లో ఒకడైన దీపక్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Latest News