నా భర్తకు బెయిల్‌ రాకుండా మొత్తం వ్యవస్థ అడ్డుకుంటున్నది.. : సునీత కేజ్రీవాల్‌

తన భర్తకు బెయిల్ రాకుండా ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలూ ప్రయత్నాలు చేస్తున్నాయని సునీత కేజ్రీవాల్‌ విమర్శించారు. ఇదంతా నియంతృత్వం, అత్యయిక పరిస్థితి అని అభివర్ణించారు

  • Publish Date - June 26, 2024 / 06:10 PM IST

న్యూఢిల్లీ: తన భర్తకు బెయిల్ రాకుండా ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలూ ప్రయత్నాలు చేస్తున్నాయని సునీత కేజ్రీవాల్‌ విమర్శించారు. ఇదంతా నియంతృత్వం, అత్యయిక పరిస్థితి అని అభివర్ణించారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చే అవకాశాలు ఉండటంతో భయపడిపోయిన బీజేపీ.. ఫేక్‌ కేసులో సీబీఐతో అరెస్టు చేయించిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శించింది. బుధవారం ఎక్స్‌లో హిందీలో ఒక పోస్టు పెట్టిన సునీత కేజ్రీవాల్‌.. ‘మనీలాండరింగ్‌ కేసులో నా భర్తకు జూన్‌ 20వ తేదీన బెయిల్‌ లభించింది.

కానీ.. ఈడీ వెంటనే దానిపై స్టే పొందింది. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌ను సీబీఐ నిందితుడిగా చేసింది. ఈ రోజు ఆయనను అరెస్టు చేశారు. మొత్తం వ్యవస్థ ఆయన జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తన్నది. ఇది న్యాయం కాదు. ఇది నియంతృత్వం. ఇది ఎమర్జెన్సీ’ అని పేర్కొన్నారు. ఈడీ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ లిక్కర్‌ పాలసీ కేసులో బుధవారం లాంఛనంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్‌ 1 నుంచి కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు ఆయనకు మే 10న మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. 21 రోజుల అనంతరం జూన్‌ 2వ తేదీన ఆయన తిరిగి లొంగిపోయారు.

Latest News